తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా కరోనా టీకాల పంపిణీ

రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు టీకాల పంపిణీ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేడు,రేపు కొవిడ్‌ టీకాల పంపిణీని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

డ్రోన్ల ద్వారా కరోనా టీకాల పంపిణీ
డ్రోన్ల ద్వారా కరోనా టీకాల పంపిణీ

By

Published : May 1, 2021, 4:58 AM IST

రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కరోనా టీకాల పంపిణీ కోసం డ్రోన్లను వినియోగించేందుకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. ఇప్పటికే కరోనా ఔషధాల పంపిణీలో డ్రోన్ల వినియోగానికి దేశంలో తొలిసారిగా తెలంగాణ అనుమతి పొందింది. వాహనాలు వెళ్లడానికి వీలులేని ప్రాంతాలకు, నదులు, కాల్వల తీరంలోని గ్రామాలకు ఔషధాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తోంది. అలాగే జనసమ్మర్థ ప్రాంతాల్లో రద్దీని గుర్తించి నియంత్రించడం, అటవీ ప్రాంతాల్లో విత్తనాలు జల్లడంతో వంటి పలు అవసరాలకు డ్రోన్లను వినియోగిస్తోంది. విదేశాల్లో ఈ రకమైన ఆధునిక సాంకేతికత వినియోగం విస్తృతంగా ఉండడంతో రాష్ట్రంలోనూ వాటి వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖలోని నూతన సాంకేతికతల విభాగం 2019లో డ్రోన్ల వినియోగంపై ముసాయిదా విధానాన్ని రూపొందింది. ఆకాశ మార్గం నుంచి ఔషధాల చేరవేత కోసం సర్వీసు ప్రొవైడర్లను ఎంపిక చేసింది. తొలిసారిగా వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి నుంచి వివిధ ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలకు ఔషధాలను పంపించింది. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసింది.
ఎంతో ఉపయోగకరం: జయేశ్‌రంజన్‌
డ్రోన్ల వినియోగానికి కేంద్రం అనుమతి లభించడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హర్షం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య సేవలందిస్తోంది. అత్యవసర సమయాల్లో అతి తక్కువ సమయంలో ఔషధాలను చేరవేస్తే చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు.

నేడు, రేపు వ్యాక్సిన్లు బంద్‌

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శని, ఆదివారాల్లో కొవిడ్‌ టీకాల పంపిణీని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి టీకాల సరఫరా జరగని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ప్రశాంతంగా ముగిసిన మినీ పురపోరు.. 69 శాతం పోలింగ్​ నమోదు

ABOUT THE AUTHOR

...view details