భూదస్త్రాల నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన తప్పులు నిజమైన యజమానుల పాలిట శాపంగా మారుతున్నాయి. బై నంబర్ల వివాదాలు చాలాచోట్ల ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమైన ఇలాంటి భూముల క్రయవిక్రయాలు జరిగితే మున్ముందు మరిన్ని వివాదాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. చేతిరాతతో కొనసాగిన దస్త్రాల్లో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడి యాజమాన్య హక్కులు మార్పిడి చేసిన సంఘటనల్లోనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టకపోవడం వల్ల సర్వే నంబర్లకు బై నంబర్లు వేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు సర్వేనంబరు 20లో భూమిని ఇద్దరు కొనుగోలు చేస్తే ఆ సంఖ్యకు ‘అ’ లేదా ‘1’ చేర్చుతూ(20/అ లేదా 20/1) వస్తున్నారు. మరోమారు విక్రయం జరిగితే 20/అ/అ లేదా 20/1/1గా నమోదు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు 1 బిలో (రెవెన్యూ మాతృదస్త్రం) నమోదు చేయాల్సి ఉండగా చాలాచోట్ల చేయలేదు.