* నల్గొండ పట్టణానికి చెందిన రామస్వామి, కాశయ్య అనే అన్నదమ్ముల్ని గట్టు తగాదా మట్టుపెట్టింది. ఇద్దరి పొలానికి మధ్య గట్టు విషయంలో కాశయ్య కుమారులు మల్లేశ్, మహేశ్ దారికాచి తన పెదనాన్న రామస్వామిని హత్య చేశారు. అదే రోజు సాయంత్రం రామస్వామి కుమారుడు కిరణ్ తన బాబాయి కాశయ్యను హతమార్చాడు.
* తాజాగా బుధవారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం బ్రాహ్మణపల్లిలో పెద్దకుమారుడికి కాస్త ఎక్కువ భూమి పంచుతానని చెప్పిన పాపానికి మిగిలిన ఇద్దరు కుమారులు కన్నతండ్రి పాపయ్య(60)ను హతమార్చడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకూ ఎకరం రూ. 2 లక్షలున్న భూమి ఇప్పుడు రూ. 25 లక్షల వరకు పలుకుతోంది. ఇది రక్తసంబంధీకుల మధ్యే ఆశ పుట్టిస్తోంది.. ఆస్తి పంపకాల్లో ముసలం మొదలవుతోంది.. కుటుంబ వివాదాలు కాస్తా పంచాయితీలవుతున్నాయి. ఒక్కోసారి హత్యలకూ దారితీస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో భూసంబంధ నేరాలు పెరుగుతున్నాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిలో ఈ విషయం వెల్లడైంది. అన్ని వివాదాలూ హత్యల వరకూ వెళ్లకపోయినా వాటాల పేరుతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న కేసులూ భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా గ్రామాల్లో ఆస్తి కోసం ఘర్షణ పడుతున్న కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో భూవివాదాల కారణంగా 93 హత్యలు జరిగాయి. అంతకు ముందు ఏడాది అంటే 2019లో 73, 2018లో 69 హత్యలు జరిగాయి. వాస్తవానికి 2019 కంటే 2020లో హత్య కేసులు (అన్నీ కలిపి) 37 తక్కువగా నమోదయ్యాయి. ఇదే సమయంలో భూవివాదాల కారణంగా జరిగిన హత్యలు 20 వరకు పెరిగాయి.
ధరల పెరుగుదలే కారణం...
రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతుండటమే వివాదాలకు మూలంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇళ్లు, ప్లాట్ల వంటి స్థిరాస్తి వ్యాపారానికి మాత్రమే పరిమితమైన లావాదేవీలు ఇప్పుడు వ్యవసాయ భూములకూ విస్తరించాయి. ఇలా కొనడం, అలా అమ్మడం లేదా ఇక్కడ అమ్మి అక్కడ కొనడం వంటివి పెరిగాయి. హైదరాబాద్ నుంచి వచ్చి మారుమూల గ్రామాల్లో కూడా కొందరు భూములు కొంటున్నారు. ఇలా ధరలు పెరిగిన క్రమంలో వివాదాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. గతంలో ఇలాంటి వివాదాలు వ్యాపార సంబంధమైనవే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సొంత కుటుంబీకులే వాటాల కోసం రోడ్డెక్కుతున్నారు.