Disha Encounter Case Latest Update :దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో దాఖలైన పలు పిటిషన్లలో ప్రతివాదులుగా తమ వాదనలు వినిపించడానికి వీలుగా పోలీస్ అధికారులకు హైకోర్టు అనుమతించింది. కేసు పారదర్శక విచారణలో భాగంగా పోలీసులు వాదన వినిపించడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. తుది విచారణలో ఈ వాదనలు వింటామని తెలిపింది.
Telangana HC On Disha Accused Encounter Case :దిశ కేసులో నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవుల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, పోలీసులపై ఐపీసీ 302 కింద హత్యా నేరం నమోదు చేయాలంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఇతర పిటిషన్లలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ పోలీసు అధికారులు, పోలీసులు, దిశ తండ్రి తదితరులు 6 మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది.
Sirpurkar Commission Inquiry: దిశ నిందితుల్లో మైనర్లున్నారా?
పోలీసులు, పోలీసు అధికారుల సంఘం తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2019 డిసెంబర్లో జరిగిన సంఘటనపై సిట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పించిందని తెలిపారు. ఒకసారి దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించిన తర్వాత ఈ కోర్టు జోక్యం చేసుకుంటే వారి హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదయ్యాక రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ దర్యాప్తునకు అనుమతించినట్లయితే నిందితులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందువల్ల పిటిషన్లపై విచారణ చేపట్టే ముందు తమ వాదన వినాలని కోరారు.
Police On Disha Encounter Case Updates :పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ "ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు హక్కులు ఉండవు. పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులపై ఐపీసీ సెక్షన్ 302 బదులు 307 కింద కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు. రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదనడం కేవలం అపోహ మాత్రమే. ఒక ఫిర్యాదుకు వ్యతిరేకంగా ప్రతి ఫిర్యాదు చేయడం చట్టప్రకారం విరుద్ధమేమీ కాదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ కూడా ఇది కాగ్నిజబుల్ నేరంగా పేర్కొంది. అందువల్ల పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాల్సి ఉంది. " అని స్పష్టం చేశారు.