దిశ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా కేసును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డితో పాటు.. నలుగురు అదనపు డీసీపీల ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. బృందాల్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఒక్కో బృందానికి ఒక్కో అధికారి నేతృత్వం వహిస్తున్నారు. క్లూస్ టీం బృందాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, నిందితుల విచారణకు సంబంధించి ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో టీం పర్యవేక్షించనుంది.
కీలకం కానున్న ఫోరెన్సిక్ ఆధారాలు...
ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు.... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే నివేదిక కేసులో కీలకం కానుంది. దిశను అత్యాచారం చేసిన ఘటనా స్థలంలో పోలీసులు ఇప్పటికే... దిశకు చెందిన లోదుస్తులు, గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నిందితులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లను సేకరించి సరిపోల్చనున్నారు. చటాన్‌పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన చోట దిశ బంగారు గొలుసు, జీన్స్ ప్యాంటు ముక్క లభించాయి.