భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయనకు సత్సంబంధాలు లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు సంచలనంగా మారాయి. తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకమైన నేతగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఈటలపై విచారణకు ఆదేశించడంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి తన సొంత నియోజకవర్గంలో వివిధ సందర్భాల్లో రాజేందర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ‘పార్టీకి ఎవరూ ఓనర్లు కాదని’ ఒకసారి, వ్యవసాయ బిల్లుల గురించి ఇంకోసారి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల 2001లో తెరాస ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్నారు. 2004లో కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభలో తెరాస పక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుసగా గెలుపొందారు. మొదటి నుంచీ కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ఆయనకు 2014లో తెలంగాణ ఆవిర్భవించి తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన ఆర్థిక మంత్రిత్వశాఖ లభించింది. మొదట్లో బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత దూరం పెరిగినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. 2018లో శాసనసభ ఎన్నికల్లో రెండోసారి తెరాస గెలిచిన తర్వాత మొదట మహమూద్‌అలీ ఒక్కరే కేసీఆర్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా చివరి వరకు ఈటల స్థానంపై ఊగిసలాట జరిగి ఆఖరి నిమిషంలో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రెండోదఫా ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్పగించారు. అయితే క్రమంగా విభేదాలు ఎక్కువయ్యాయనే అభిప్రాయం ఉంది.
గత కొన్ని నెలలుగా ఈటల తనలోని అసంతృప్తిని బహిర్గతం చేస్తూ వివిధ సభలు, సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని పలువురు మంత్రులు, నేతలు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు హుజూరాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సీఎం ఆదేశాల మేరకు కేటీఆర్ ఆయనను ప్రగతి భవన్‌కు తీసుకెళ్లి ఆ వ్యాఖ్యల గురించి అడిగినట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని ఈటల చెప్పినట్లు సమాచారం. అయితే పరిస్థితిలో ఆ తర్వాతా మార్పు రాకపోగా, గత కొంతకాలంగా ఈటల కార్యక్రమాలు, ఆయన చేసే వ్యాఖ్యలను ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోందని పార్టీలోని ముఖ్య నాయకుడొకరు తెలిపారు.