అసంపూర్తిగా ముగిసిన హనుమాన్ జన్మస్థలంపై చర్చ హనుమాన్ జన్మస్థలం(TTD-Hanuman birth place)పై చర్చ అసంపూర్తిగా ముగిసింది. తితిదే-హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మధ్య చర్చ ఇవాళ జరిగింది. తితిదే వాదనలను హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిరాకరించింది. రామాయణం ప్రకారం కిష్కిందనే మారుతీ జన్మస్థలం అని ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి వ్యాఖ్యానించారు. సంస్కృత విద్యాపీఠంలో చర్చించామని హనుమద్ జన్మస్థల తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. తితిదే పవిత్ర పుణ్యక్షేత్రం అని.. పంపా క్షేత్ర కిష్కింద మాకు ఒక కన్ను, తితిదే ఒక కన్ను అని గోవిందానంద పేర్కొన్నారు.
మీడియా లేకుండా ఎందుకు..?
మీడియా లేకుండా ఆంతరంగికంగా సమావేశం ఎందుకు..?అని గోవిందానంద ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్‌లో ఇచ్చిన బుక్‌లెట్‌లో ఉన్న విషయాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఆంజనేయుడి జన్మ తిథిపై స్పష్టత లేదన్న గోవిందానంద సరస్వతి... తితిదే వాళ్లు పంపాకు ఎప్పుడైనా వచ్చారా? అని ప్రశ్నించారు. కిష్కిందకు తితిదే వాళ్లు ఎందుకు రాలేదని నిలదీశారు. తితిదే కమిటీకి అధికారం ఉందా..?అని గోవిందానంద ప్రశ్నించారు. కమిటీ పెడుతున్నప్పుడు తిరుపతి పెద్దజీయర్‌స్వామిని అడిగారా.. అని నిలదీశారు.
పెద్దజీయర్‌స్వామి కమిటీలో ఎందుకు లేరు..?
పెద్దజీయర్‌స్వామి కమిటీలో ఎందుకు లేరని గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు. రామానుజ సంప్రదాయం ఆంజనేయ వారికి వివాహం చేస్తారా..? అని నిలదీశారు. కల్పాలు, మన్వంతరాలు గడిచాక చర్చ ఏంటని వ్యాఖ్యానించారు. తితిదే కమిటీకి ప్రామాణికత లేదన్న ట్రస్టీ గోవిందానంద సరస్వతి... ధార్మిక విషయాలను ఎవరు నిర్ణయించాలని ప్రశ్నించారు. శృంగేరి శంకరచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతుల సమక్షంలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. మధ్వాచార్యులు, తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ సమక్షంలో చర్చించాలన్నారు.
సామాన్య జనాలను గందరగోళంలోకి నెట్టేలా తితిదే వాదనలు ఉన్నాయి. హనుమంతుడి జన్మ తిధి అంటూ మూడు తిధులు ఎలా పెడతారు? తితిదే పుస్తకంపై జీయర్ స్వాముల వద్దకు మేము వెళ్తాం. ధర్మం గురించి తేల్చాల్సింది ధర్మాచార్యులే. తితిదే వాదనలను హంపి హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిరాకరించింది. విజయవాడలో అయోధ్య నగర్ ఉంది... అందుకని అయోధ్య అనరు కదా?. నిర్ణయం తీసుకోవాలంటే తిరుపతి పెద్దజీయర్‌కే అధికారం ఉంది. తితిదే తీసుకున్న నిర్ణయాన్ని.. తమ నిర్ణయంగా పెద్దజీయర్ ప్రకటిస్తారా?. తితిదేపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోం. కేవలం కమిటీ అభిప్రాయంగానే పరిగణించండి. అధికారుల అభిప్రాయమేగానీ జీయర్ స్వాములకు సంబంధం లేదు. క్షీరసాగర మథనం జరుగుతోంది. ఇప్పుడు హాలాహలం వచ్చింది.. తర్వాత అమృతం వస్తుంది.-గోవిందానంద సరస్వతి
ఇదీ చదవండి:Devarayamjal lands: దేవరయాంజల్ భూముల్లోని వారిని ఖాళీ చేయించొద్దు: హైకోర్టు