Telangana Budget Sessions 2023-24 : రాష్ట్ర బడ్జెట్ పద్దులపై శాసనసభలో ఇవాళ చర్చ ముగియనుంది. గత రెండు రోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన ఇవాళ మిగిలిన 13 పద్దులపై చర్చ జరగనుంది. నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ,సహకార,పంచాయతీ రాజ్, రవాణాశాఖ, గవర్నర్-మంత్రిమండలి పద్దులపై చర్చచేపట్టనున్నారు.
Telangana Budget Sessions 2023 : వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులపైనా అసెంబ్లీలో చర్చ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 18వేల ,257 కోట్ల అనుబంధ వ్యయ అంచనాలను ఆర్థికమంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. చేపల ఉత్పత్తి, ఎస్‌ఆర్‌డీపీ, మెట్రో రైల్‌పొడిగింపు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, పాల ఉత్పత్తి, నీరా కేఫ్, చెక్ డ్యాంల నిర్మాణం, క్రీడా మైదానాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.
KCR on Podu Lands distribution : బడ్జెట్‌పై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో పోడు భూములు, వైద్య కళాశాలలు, ఐటీ, చేనేత రంగాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11.5 లక్షల ఎకరాల్లో పోడు సాగవుతున్నట్లు గుర్తించామని, ఈ నెలాఖరులోగా ఎమ్మెల్యేల సమక్షంలో సదరు భూములను గిరిజనులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇకపై అటవీ భూములను ఆక్రమించబోమంటూ ఆయా గిరిజనుల నుంచి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఆ గ్రామ గిరిజన పెద్దలు, అఖిలపక్ష నాయకుల సమక్షంలో సంతకాలు తీసుకున్న తరవాతే పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీపడదని, సంతకాలు చేసేందుకు ముందుకురాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
KTR fires on Central Government : ‘కేంద్రం పనితీరు శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలు అన్నట్లుంది. చేనేత కార్మికులను ఆదుకోవాలని వందసార్లు కేంద్రాన్ని అడిగినా స్పందించలేదు. ఎనిమిదేళ్లుగా ఎక్కని కొండలేదు.. మొక్కని బండలేదన్నట్టు కేంద్రంలో ఎవరు మంత్రి ఉంటే వారిని వెళ్లి కలిశాం. ఏ ప్రధాని చేయని రీతిలో మోదీ చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించారు. ఇది రద్దుచేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఉలుకూ పలుకూ లేదు. ఇంతటితో ఆగకుండా 5శాతం పన్నును 12కి పెంచి చేనేత కార్మికులను చావగొట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్నును సున్నాకు తగ్గించాలని చేనేత కార్మికులందరి తరఫున హృదయపూర్వకంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. పలు శాఖల బడ్జెట్ పద్దులపై శాసనసభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆయన సమాధానాలిచ్చారు.
మునుపటి పాలకులు వైద్యవిద్యను నిర్లక్ష్యం చేయడం వల్లనే తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, కజకిస్తాన్, చైనా వంటి దేశాల్లో ఎంబీబీఎస్ చదవాల్సి వచ్చిందని, ఆ పరిస్థితిని తప్పించేందుకే సీఎం కేసీఆర్ 33 జిల్లాల్లో 33 వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, సంజయ్, పద్మాదేవేందర్‌రెడ్డి, కౌసర్ మొహియుద్దీన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.