తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీలో వాడీవేడి చర్చ.. ధరణిపై మాటల యుద్ధం.. శ్రీధర్‌ బాబు వర్సెస్ కేటీఆర్ - Telangana assembly sessions

Telangana Budget Sessions 2023-24 : ధరణి పోర్టల్‌పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమస్యల పరిష్కారం జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఆరోపించారు. ధరణితో రైతులు సంతోషంగా ఉన్నారన్న అధికార పక్షం.. నిరాధార ఆరోపణలు సరికాదని బదులిచ్చింది.

Telangana assembly sessions
Telangana assembly sessions

By

Published : Feb 9, 2023, 3:37 PM IST

Updated : Feb 10, 2023, 7:15 AM IST

Telangana Budget Sessions 2023-24 : ధరణి పోర్టల్‌ అంశం గురువారం శాసనసభలో భారాస, కాంగ్రెస్‌ల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది. ఇరుపక్షాల సభ్యుల వాగ్వివాదాలతో సభ కాసేపు వేడెక్కింది. ధరణి వల్ల తలెత్తుతున్న సమస్యలపై కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీధర్‌బాబు మాట్లాడిన సందర్భంలో.. మంత్రి కేటీఆర్‌ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శ్రీధర్‌బాబు ఆయా సమస్యలను ప్రస్తావించి, పోర్టల్‌లో పలు మార్పులు చేయాలంటూ ప్రసంగిస్తుండగా.. ధరణిపై మీ పార్టీ వైఖరేంటని మంత్రితో పాటు పలువురు భారాస సభ్యులు పదేపదే ఆయనను ప్రశ్నించారు. దీంతో శ్రీధర్‌బాబు ధరణిని రద్దు చేయడమే కాంగ్రెస్‌ పార్టీ విధానమంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్‌ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. తొలుత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ సమస్యలపై ఇప్పటికే 5 లక్షల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భూ సమస్యల కారణంగా ఈ ఏడాది నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక రైతు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. భూములు అమ్మినా పాత రైతుల పేర్లే కనిపిస్తున్నాయని, రైతుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

లంచగొండితనమే మీ విధానమా? :ఈ సందర్భంలో మంత్రి కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభతరమైందని, ఒకటో రెండో లోపాలుంటే.. వాటిని భూతద్దంలో చూపెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం సరికాదన్నారు. లోపాలుంటే సరిచేస్తామన్నారు. ‘ధరణిని రద్దు చేస్తామని మీ (కాంగ్రెస్‌) పార్టీ అధ్యక్షుడు చెబుతున్నారు. అదే మీ పార్టీ విధానమైతే చెప్పండి. కాంగ్రెస్‌ హయాంలో లంచాలిస్తే గానీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? రెవెన్యూ వ్యవస్థలో లంచగొండితనం ఉండాలనేది వారి విధానమైతే అదే చెప్పమనండి. ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా? ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదు’ అన్నారు.

ఎసైన్డ్‌ భూములను ప్రభుత్వం వేలం వేస్తోంది:దీనిపై శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. రెవెన్యూ పహాణీలో సాగుదారు, కౌలుదారు సహా అనేక కాలమ్స్‌ను తీసేశారని, వాటన్నిటినీ పొందుపర్చాలనేది తమ డిమాండ్‌ అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలనేది తమ పార్టీ అధ్యక్షుడి విధానమని స్పష్టం చేశారు. ‘భూ సమస్యలు పరిష్కారం కాక ఒకచోట తహసీల్దార్‌ను హత్య చేశారు. అందుకే ధరణిని రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు’ అన్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు అధికార పక్ష నాయకులు.. ధరణిపై మీ వైఖరేమిటంటూ పదేపదే ప్రశ్నించడంతో ‘ధరణిని రద్దు చేయాలన్నదే కాంగ్రెస్‌ విధానం’ అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ధరణి లోపాల వల్ల కొన్ని దశాబ్దాలుగా ఉన్నవారు హక్కును కోల్పోయారని, ప్రభుత్వ వ్యవస్థ విఫలమైతే, మరో వ్యవస్థ పుట్టుకొస్తుందని.. అది మంచిది కాదన్నారు. శ్రీధర్‌బాబు కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 22.6 లక్షల ఎకరాల ఎసైన్డ్‌ భూములను పేదలకు కేటాయించిందని, వీటిని ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసేసుకొని కలెక్టరేట్లు, శ్మశానాల నిర్మాణాలకు వినియోగిస్తోందన్నారు. హైదరాబాద్‌ పరిసరాల్లో ఎసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని వేలం వేస్తోందని విమర్శించారు. ఫార్మాసిటీ కోసం ప్రజల నుంచి ఎకరం రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వం తీసుకొని.. కంపెనీలకు రూ.1.30 కోట్లకు అమ్ముతోంది’ అని ఆరోపించారు.

బ్లాక్‌మెయిల్‌ చేసే వారికి ఇబ్బంది :ఈ క్రమంలో కేటీఆర్‌ మళ్లీ కలగజేసుకొని.. ‘శ్రీధర్‌బాబు అసత్యాలు చెబుతున్నారు. ఒక్క సెంటు భూమినైనా కేటాయించినట్లు నిరూపించగలరా? లేదా ప్రభుత్వానికి క్షమాపణ చెబుతారా? ఆయన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి. లేదంటే రికార్డుల నుంచి తొలగించాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘ఆర్టీఐ పేరిట అడ్డగోలుగా బ్లాక్‌మెయిల్‌ దందాలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల భూములపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వద్ద ఒక దఫ్తర్‌ నడుస్తోంది. ఒక ప్రత్యేక కార్యాలయంలో విశ్రాంత తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని, ప్రభుత్వాన్ని, ప్రైవేటు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసేవారికి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది’ అని ధ్వజమెత్తారు. ఈ దశలో వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని స్పీకర్‌ పదే పదే శ్రీధర్‌బాబును కోరారు. అయినా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పకుండా.. శ్రీధర్‌బాబు ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

ధరణిపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ.. శ్రీధర్‌ బాబు వర్సెస్ కేటీఆర్

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ సభ్యులు :మరోవైపు అసెంబ్లీలో విద్యుత్‌ సమస్యపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయయని.. ఇచ్చే 4 గంటల్లో కూడా కోత విధిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. విద్యుత్ సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ఇస్తే స్పీకర్ అందుకు అనుమతి ఇవ్వలేదని.. తమ గొంతు పోయేలా అరిచినా పట్టించుకోవడం లేదని.. తమ వైపు కూడా చూడడం లేదని భట్టి ఆక్షేపించారు.

అందుకే నిరసనగా సభ నుంచి బయటకు వచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో ఒక్క వాయిదా తీర్మానాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సబ్​స్టేషన్‌ల వారీగా విద్యుత్ సరఫరా వివరాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈఆర్‌సీ ముందు డిస్కంలు రూ.16,000 కోట్లు వసూలు చేయాలని నివేదికలోప్రతిపాదించాయని.. ఇది ప్రజలపై భారం మోపే ఆలోచనగా ఉందని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మండిపడ్డారు.

ఇవీ చదవండి:ఉద్యమం చేసైనా సింగరేణిని కాపాడుకుంటాం.. అసెంబ్లీలో కేటీఆర్‌

సుప్రీంకు చేరిన 'అదానీ' వ్యవహారం.. శుక్రవారమే విచారణ

Last Updated : Feb 10, 2023, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details