శాసనమండలిలో బడ్జెట్‌పై ఇవాళ సాధారణ చర్చ ముగిసింది. దీనిపై ఆర్థికమంత్రి హరీశ్ రావు రేపు సమాధానం ఇవ్వనున్నారు. పలు ప్రధాన శాఖాలకు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా గంధంగూడాలోని 3.22 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైన మాట వాస్తవమేనని... గోపన్‌పల్లిలో జరిగిన భూదందాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'డబుల్' ఇళ్లు పూర్తి చేస్తాం
శాసన మండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్‌పై సాధరణ చర్చ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 వేల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో లక్ష 16 వేల ఇళ్లు పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల 89 వేల ఇళ్లు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. డబుల్ బెడ్ రూముల ఇళ్ల నిర్మాణం కోసం 7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తే 6 వేల 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిందని వివరించారు. కేంద్రం ఇవ్వాల్సిన వాటా విడుదల చేయలేదన్నారు.
రవాణా మంత్రి క్షమాపణ
ఆర్టీసీ అధికారులు తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ సభలో క్షమాపణ చెప్పారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం అధికారుల తప్పేనన్నారు. ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా ఏడాదికి 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నెలాఖరుకు ప్రారంభించేందుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తున్నామన్నారు.
పెరిగిన ఆర్టీసీ ఆదాయం
ఆర్టీసీకి గతంలో 11 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే... ఇప్పుడు 12.50 కోట్లు వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు 235 కోట్లు చెల్లించినందుకు... ఆర్టీసీ ఐకాస నాయకులే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీపీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని వివరించారు.