రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెషన్ రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించారు. ప్రసంగం ఆసాంతం ప్రభుత్వాన్ని పోగడటమే సరిపోయిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
గవర్నర్‌తో అబద్ధాలు..
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు.
సీఏఏపై తర్వాత చర్చిద్దాం..
చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్.. సీఏఏ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది సమయం కాదని హితవు పలికారు. సీఏఏపై తర్వాత చర్చిద్దామని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి ఆగ్రహం..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై నిప్పులు చెరిగారు. ఈక్రమంలోనే అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి అడ్డుపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
"నేను కేసీఆర్ బొమ్మతో గెలవలేదు. ప్రజలు గెలిపిస్తే ఇక్కడికి వచ్చాను. మాట్లాడే గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..!" రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని అని దుయ్యబట్టారు.
ఆరుగురు సభ్యులు సస్పెండ్..
భోజన విరామం అనంతరం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా... కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి.. సభలో ఉన్న ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్సన్‌కు తీర్మానం ప్రతిపాదించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డిని ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు చేశారు.
ఇదీ చూడండి :'కరోనాపై వచ్చే వదంతులను నమ్మొద్దు'