Karnataka Results Effect On Telangana BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించడంతో ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఈ ఫలితాలు దోహాదం చేస్తుంటే.. బీజేపీ ఆశలకు గండిపడిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని పదేపదే చెబుతూ వస్తున్న... కమలనాథులకు కర్ణాటక ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ: కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ భావించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కనుమరుగవుతే ఆ పార్టీలోని ముఖ్యనేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంది. ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసి ఇతర పార్టీల్లోని అసంతృప్తుల నేతలతో పాటు బీఆర్ఎస్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవాలని తహతహలాడింది.
ఫలితాలు తారుమారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశలు కాస్త గల్లంతయ్యాయి. కొద్ది రోజుల పాటు బీజేపీలోకి చేరికలు ఆగిపోయే పరిస్థితి ఉంటుందని.. ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఏమీ ఉండదని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. రెండు, మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో స్తబ్దత నెలకొంటుందని.. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఎన్నికల నాటికి తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉందని కాషాయ దళం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.