Disappointment for Telangana in Union Budget 2023-24 : ఎన్నికల ఏడాదైనా కేంద్ర బడ్జెట్‌లో తగిన తోడ్పాటు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అందులో భాగంగా పలు విజ్ఞప్తులు, ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం వాటికి స్థానం దక్కలేదు. రాష్ట్రానికి హక్కుగా వచ్చే పన్ను వాటా, కేంద్ర పథకాలకు నిధులు మాత్రమే రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రానికి తగిన తోడ్పాటు అందించాలని.. బకాయిలు ఇవ్వడంతో పాటు విభజన చట్టం హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతులు ఫలించలేదు.
Allocations for Telangana in Union Budget 2023-24 : సాగునీటి జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు, ఫార్మాసిటీ, పారిశ్రామిక కారిడార్లు, నిమ్జ్, హైదరాబాద్ మెట్రో, టెక్స్ టైల్ పార్క్, బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తదితరాలకు కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆశలు ఫలించలేదు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల్లో కోత విధించడంతో.. సుమారు రూ.19 వేల కోట్ల రుణాలను రాష్ట్రం పొందలేకపోయింది.
ప్రత్యేక నిధులు దక్కలేదు: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతోపాటు, కార్పొరేషన్ రుణాలను దాని పరిధి నుంచి మినహాయించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం కంటే పెంచాలన్న విజ్ఞప్తిని పట్టించుకోలేదు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఏపీకి పొరపాటున వెళ్లిన సీఎస్‌ఎస్ నిధులు కూడా రాలేదు. ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు దక్కలేదు.
సర్కార్ వినతులు ఫలించలేదు: పలు పట్టణాభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలన్న సర్కార్ వినతులు ఫలించలేదు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.8,453 కోట్లు ఇవ్వాలని కోరినా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ప్రస్తావన లేకుండా పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి బడ్జెట్‌లో నిధులివ్వాలని మూడేళ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు.