తెలంగాణ

telangana

ETV Bharat / state

SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ? - హైదరాబాద్​ తాజా వార్తలు

జులై 1 నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభించాలన్న మంత్రివర్గ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. మూడు నుంచి ఆరు వారాల్లో మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున.. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం మంచిది కాదని తెలిపింది. మరోవైపు... తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, ఇతర ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.

eopening of schools from July 1 in the state
విద్యాసంస్థల పునర్​ ప్రారంభంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు

By

Published : Jun 20, 2021, 11:28 AM IST

రాష్ట్రం ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించడంపై... ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నుంచి ఆరు వారాల్లో కరోనా మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం మంచిది కాదని... హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట్ అన్నారు. మంత్రివర్గ నిర్ణయంపై ప్రభుత్వం పునర్​ సమీక్షించాలని ఆయన కోరారు.

తగు జాగ్రత్తలు పాటించాలి...

మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని... తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య స్వాగతించాయి. విద్యాసంస్థల్లో తగిన జాగ్రత్తలు పాటించి, అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని టీపీఏ అధ్యక్షుడు నాగటి నారాయణ సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వమే మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని... విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలు బోధన రుసుము మాత్రమే తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయి సన్నద్ధత లేదని పేర్కొన్నారు.

విద్యార్ధులందరికీ టీకాలు వేయాలి...

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ షెడ్యూలు ప్రకటించాలని... టీఎస్ యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ... కళాశాలల ప్రారంభానికి ముందే వ్యాక్సిన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని... తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్​ చేశారు. విద్యా సంస్థలు ప్రారంభించాలని నిర్ణయించినందున వెంటనే తమను రీఎంగేజ్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్​లో పని చేస్తున్న ఆర్ట్స్, క్రాఫ్ట్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కోరారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం...

కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి.. గడ్డు పరిస్థితిలో పడ్డారు. విద్యాసంస్థలు తెరవకపోవడంతో వారికి వేతనాలు లేక... ఆదాయం రాక... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ధైర్యం కోల్పోకుండా... కరోనా తెచ్చిన కష్టాలకు ఇన్ని రోజులుగా ఎదురీదుతూనే ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు పునర్​ ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఉపాధి దొరికుతుందని అంటున్నారు.

అధికారుల సన్నద్ధత...

శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జులై 1వ తేదీనుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యాసంస్థలను... పూర్తి స్థాయి సన్నద్ధతతో పునఃప్రారంభించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఆఫ్​లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకావచ్చని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు విద్యాశాఖ సూచించింది. తాజా నిర్ణయంతో ఆ దిశగా అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: తండ్రీ కూతురి బంధం... వెలకట్టగలమా ఈ అనుబంధం

ABOUT THE AUTHOR

...view details