Young Director Anshul Singh: ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ దర్శకుడి పేరు అన్షుల్ సింగ్. సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే షార్ట్ ఫిల్మ్ తీయడం నేర్చుకున్నాడు. ఎంతలా అంటే అవార్డుల పంట పండించేంతలా. అదే తనకు బంగారు భవిష్యత్ను చూపించింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఎదగాలన్న సంకల్పంతో.అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకునే రెంజ్కు చేరుకున్నాడు.
లఘు చిత్రానికే 21 అవార్డులు: హైదరాబాద్‌లో పుట్టి ముంబయిలో పెరిగిన అన్షుల్ మాస్ కమ్యూనికేషన్లో ఎంబీఏ పూర్తి చేశాడు. సినిమాలపై అభిరుచితో అన్నపూర్ణ ఫిల్మ్ మేకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నాడు. 2012లో తన కెరీర్ను మొదలు పెట్టిన అన్షుల్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పై దృష్టి సారించాడు. మొదట్లో ఎలాంటి వనరులు లేకున్నా తన వద్ద ఉన్న సెల్ ఫోన్‌తో మై చాక్లెట్ కవర్ అనే 5 నిమిషాల లఘు చిత్రాన్ని రూపొందించాడు. ఎలాంటి సంభాషణలు లేకుండా నిశ్శబ్దంగా సాగే ఆ లఘు చిత్రంకు హైదరాబాద్ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో 21 అవార్డులు తెచ్చిపెట్టింది.
సెల్‌ఫోన్‌తోనే చిత్రం: ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఐదేళ్లు రాత్రి షిఫ్టులలో పని చేస్తూ సినిమాపై ఉన్న పిచ్చితో సెల్‌ఫోన్‌తోనే లఘు చిత్రాలు తీయడం నేర్చుకున్నాడు. తొలినాళ్లలో తను తీసిన ఎన్నో లఘు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డుల పంట పండించాయి. అందులో రైతుల ఆత్మహత్యలపై అవగాహన పెంచేలా చేసిన మిట్టి అనే లఘు చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని సిక్కింలో ఇప్పటికీ ప్రతి ఆదివారం ప్రదర్శిస్తుండటం విశేషం. అందుకు నాకు వచ్చిన ఆవార్డులు ఎంతో ప్రత్యేకమని చెబుతున్నాడు.