తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ నేలపై డైనోసార్​లు - Dinosaurs special museum in Hyderabad

డైనోసార్... ఈ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అత్యంత భయంకరంగా కనిపించే ఈ క్రూర జంతువు ఎలా ఉంటుందో తెలియని వేళ... జూరాసిక్‌ పార్క్‌ చిత్రం ఆ రూపాన్ని కళ్లకు కట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్​లు తెలంగాణ నేలపై సైతం తిరగాడాయని జియాలజిస్టులు ప్రామాణికంగా రుజువు చేస్తున్నారు.

Dinosaurs
తెలంగాణలో డైనోసార్​లు

By

Published : Mar 10, 2020, 6:00 AM IST

తెలంగాణలో డైనోసార్​లు

జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 170వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా... హైదరాబాద్‌ బండ్లగూడ జీఎస్​ఐ మ్యూజియంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు.. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డైనోసార్‌ల ప్రతిమలు, అవశేషాలను ఆసక్తిగా తిలకించారు. మిలియన్ ఏళ్ల క్రితం మన నేలపై యథేచ్ఛగా తిరిగిన క్రూర మృగాల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు జియాలజిస్టులు వివరించారు.

యామనపల్లిలో అవశేషాలు..

బండ్లగూడలో జియో సైంటిస్ట్ విలియం కింగ్ పేరిట ఏర్పాటు చేసిన జీఎస్​ఐ, బిర్లా మ్యూజియంలో డైనోసర్‌ల అస్థిపంజరాలు భద్రంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతి భారీ ఆకారంలో ఉన్న జంతు అవశేషాలు... జయశంకర్ భూపాలపల్లి జిల్లా యామనపల్లిలో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతం పేరుతోనే దీనికి కోటాసారస్ యామనపల్లి యాన్‌సీస్‌గా నామకరణం చేశారు.

బిర్లా మ్యూజియంలో..

కోటాసారస్ డైనోసార్ సుమారు 9 మీటర్ల పొడవు, 2.5 టన్నుల బరువు ఉంటుంది. వీటి పళ్లు స్పూన్ ఆకారంలో ఉంటాయి. 1970లో వీటికి సంబంధించిన 840 అస్థిపంజరాలు లభించాయి. కోటాసారస్‌కు సంబంధించిన అస్థిపంజరాన్ని 2001లో... బిర్లా మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శనగా ఉంచారు. వీటి అస్థిపంజరాలు మన రాష్ట్రంలో లభించినట్లు ఆధారాలు ఉన్నాయని జియాలజిస్టులు పేర్కొంటున్నారు.

కాటారంలో రింకోసార్..

కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి రింకోసారస్ అస్థిపంజరం ఆనవాళ్లు సైతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద లభ్యమయ్యాయి. అక్కడి నుంచి అస్థిపంజరాన్ని మట్టితో సహా పెకిలించుకొచ్చి... బండ్లగూడలోని జీఎస్​ఐ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడే దీనికి సంబంధించిన మోడల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. గుజరాత్‌లో లభించిన డైనోసార్ గుడ్డు కూడా ఇక్కడే భద్రంగా ఉంది. ఈ మ్యూజియంలో ఖనిజాలు, శిలలు, జెమ్ స్టోన్స్, బిల్డింగ్ స్టోన్స్ శిలాజాలు ప్రదర్శన కోసం ఉంచారు.

అగ్నిపర్వత శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలను కూడా ఇక్కడ చూడొచ్చు. దేశవ్యాప్తంగా లభించే రాళ్లన్నీ.. ఈ ప్రదర్శనలో ఒకేచోట వీక్షించే సదుపాయాన్ని కల్పించారు. కరీంనగర్, వరంగల్, మెదక్, పాక్షికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల్లో లభించే డైమన్షన్స్‌ను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details