రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒరిజినల్, వలస అంటూ సీనియర్లు అసంతృప్త గళం వినిపించిన వేళ విభేదాల పరిష్కారానికి అధిష్ఠానం చొరవ తీసుకుంది. ఆ క్రమంలోనే దిల్లీ దూతగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. మూడు రోజుల పాటు వారితో వరుస భేటీలు జరిపారు. పార్టీ సీనియర్‌లంతా సంయమనం పాటించాలని సూచించారు. పార్టీలో జూనియర్, సీనియర్ అనే తేడా ఉండదని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరితో విడివిడిగా మంతనాలు జరిపారు. నేతలంతా కలిసి పని చేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలమని.. పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్పితే బహిరంగ విమర్శలు చేసుకోవద్దని దిగ్విజయ్ సింగ్ సూచించారు. పరిస్థితులకు అనుకూలంగా కొత్తవారికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి, విజయాలు సాధించినట్లు చెప్పారు.
"కాంగ్రెస్‌లోని కార్యకర్త నుంచి సీనియర్ నేత వరకు అందరికి చేతులు జోడించి అర్థిస్తున్నా. కాంగ్రెస్ నేతలు సమస్యలు, ఏదైనా విషయంపైన మాట్లాడాలంటే పార్టీలో అంతర్గతంగా చెప్పండి. ఎవరూ బయట మాట్లాడకండి. నేతలెవరైనా పరస్పర విమర్శలు చేసుకోవడం పార్టీకి మంచిది కాదు. అందరిని కలిసి నాయకులతోనూ విడివిడిగా సావధానంగా మాట్లాడాను. అందరూ కలిసి పార్టీని ముందుకుతీసుకెళదాం. పార్టీలో జూనియర్, సీనియర్లంటూ తేడా ఏమీ లేదు. పార్టీలో తలెత్తిన సమస్యలన్నీ సర్దుకున్నట్టే."- దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించిన దిగ్విజయ్.. బీజేపీకి మేలు చేకూర్చేందుకు కేసీఆర్, ఓవైసీ పనిచేస్తుంటారని ఆరోపించారు. బీజేపీకి కేసీఆర్ బీ-టీమ్‌గా పనిచేస్తున్నారంటూ ఆక్షేపించారు.