కొవిడ్ సృష్టించిన అవకాశాలు, అందివచ్చిన కొత్త సాంకేతికతలు కారణం ఏదైనా... జాబ్ మార్కెట్లో డిజిటల్ ఉద్యోగాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. పని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్, వర్చువల్ కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలో నూతన టెక్నాలజీలైన ఏఐ, ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా లిటరసీ, డిజిటల్ కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
డిజిటల్ ఉద్యోగాలకు డిమాండ్
ఈ టెక్నాలజీలపై పట్టు.. అవకాశాలకు తొలిమెట్టుగా నిలవటమే కాక, ఈ విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో రానున్న ఐదేళ్లలో డిజిటల్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్వేలో వెల్లడైంది. 2025 నాటికి ప్రస్తుతమున్న 2.5 కోట్ల ఉద్యోగుల సంఖ్య తొమ్మిది రెట్లు పెరగాల్సిన అవసరముందని ఈ సర్వే పేర్కొంది.
69శాతం మందికి కల్పించాలి
ఆసియా, పసిఫిక్ దేశాలతో పోలిస్తే భారత్‌లో డిజిటల్ నిపుణులైన ఉద్యోగుల సంఖ్య తక్కువే అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్వే తేల్చింది. దేశంలో నిపుణులైన మానవ వనరులు ఉద్యోగాల పేరిట విదేశాల బాట పడుతున్నారు. భారత్‌లోని కార్మికుల్లో 69 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాలు కల్పించాలని... ఈమేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.