సంక్రాంతి వేడుకలకు ప్రజలంతా సిద్ధమయ్యారు. పండుగ రోజున సొంతూళ్లో ఉండాలి అనుకునే వారు ఇప్పటి నుంచే వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలివెళ్లేవారు అధికంగా ఉండటంతో రైళ్లు, బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వందలాది స్టేజీ క్యారేజీలు రోడ్డెక్కి ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
ఎక్కువ ఏపీ వాళ్లే: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సైతం సంక్రాంతికి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రాంతం వాళ్లు సొంతూళ్లకు వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కడప, చిత్తూరు, తిరుపతి తదితర మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ఇదే మంచి సమయం కావడంతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు.
ఒక్క బెర్తు కూడా ఖాళీ లేదు: అసలు సిసలైన సంక్రాంతి పండుగకు కేరాఫ్ కోస్తాంధ్ర. ఆ ప్రాంత వాసులు ఎక్కడున్నా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతూళ్లకు ప్రయాణమవుతారు. కానీ, ఏడాదికేడాదికి ప్రయాణం భారమవుతోంది. తక్కువ ఖర్చుతో.. సుఖంగా రైలులో ఊరెళదామని ఆశపడిన వారు నిరాశ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు 3 రోజుల్లో బెర్తులు.. 3 నెలల ముందే నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వెళ్లేరైళ్లలో ఒక్క బెర్తు కూడా ఖాళీగా కనిపించని పరిస్ధితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే రైళ్లలో గోదావరి, ఫలక్‌నుమా, చార్మినార్, శాతవాహన, ఈస్ట్ కోస్ట్, నర్సాపూర్, కృష్ణా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
వందల్లో వెయిటింగ్ జాబితా..: వీటన్నింటిలోనూ జనవరి 10వ తేదీ నుంచే 10 రోజుల పాటు బెర్తులన్నీ నిండిపోయాయి. రైల్వేశాఖ ప్రత్యేకంగా 94 ప్రత్యేక రైళ్లను తర్వాత మరో 30 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల పైనే ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. 11,12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రైల్వేశాఖ అంచనా వేస్తుంది. ఇటీవల ప్రకటించిన 30 ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ జాబితా వందల్లో కన్పిస్తుంది. దీంతో ప్రయాణికులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు: రైళ్లలో బెర్తులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కోసం టికెట్ బుకింగ్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆర్టీసీ లోనూ అదే పరిస్ధితి నెలకొంది. పండుగ ముందు , తర్వాతి రోజుల్లో హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ సీట్లు నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా ఈసారి ఆర్టీసీ పండుగకు ముందు, తర్వాతి రోజుల్లో ఏపీ ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ ముందు ఈ నెల 6 నుంచి 14 వరకు 3120 బస్సులు, పండుగ తర్వాత ఈ నెల 15 నుంచి 18 వరకు 3280 బస్సులు నడపుతోంది.
టీఎస్ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయలేదు: సాధారణంగా నడిపే బస్సులకు అదనంగా ఈ బస్సులు తిప్పనున్నారు. తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగ 4,233 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ఈసారి ప్రత్యేకబస్సులకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2,720 బస్సులను, ఆంధ్రప్రదేశ్‌కి 1,356 బస్సులను, కర్ణాటకకు 101 బస్సులను, మహారాష్ట్రకు 56 బస్సులను ఆర్టీసీ నడిపిస్తుంది.