Paddy Procurement Issues in Telangana : దుక్కిదున్ని, నీరుపెట్టి, నాటు వేసి, కలుపుతీసి, కోతకోసి.. వరిపంటను పండించే రైతు ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రతి సీజన్‌లోనూ కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్ సీజన్ ఒకఎత్తైతే.. తాజా యాసంగి సీజన్ మరోఎత్తుగా మారింది. ఈ క్రమంలో ప్రత్యేకించి వరి పంట పరిస్థితి దారుణంగా మారింది. పంట చేతికొస్తుందనుకునే సమయంలో మార్చి 19 నుంచి వరుసగా పడిన అకాల వర్షాలు, ఈదురు గాలులు పంట, ధాన్యాన్ని దెబ్బతీశాయి.
Paddy Procurement Problems in Telangana : ఇక కొనుగోలు కేంద్రాల్లోకి వరిధాన్యాన్ని రాశిగా పోసి 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా.. రైతులకు టోకెన్లు జారీ కావడం లేదు. కూలీల కొరత అధిగమించేందుకు హార్వెస్టర్లపై ఆధారపడితే వాటికి గంటకు రూ. 2100 నుంచి రూ.3500 ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు కల్లాలోని వరిధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఒక్కోకూలీకి రూ. 500 నుంచి రూ.600వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో 80 లక్షల 46 వేల 230 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 25 లక్షల 35 వేల టన్నులే పౌరసరఫరాల సంస్థ సేకరించింది.
Crop Damage in Telangana : 32 జిల్లాల్లో మొత్తం 7వేల 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇందిరా క్రాంతిపథం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పీఏసీఎస్‌లు కలిపి 6వేల 609 కేంద్రాలు ప్రారంభించారు. మొత్తంగా 3.75 లక్షల మంది రైతుల నుంచి సేకరిచిన ధాన్యం విలువ రూ.5వేల 211 కోట్లు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకం వేయించిన తర్వాత కూడా రైతుల కష్టాలు తీరడం లేదు. తూకం వేసిన ధాన్యం లారీలో లోడింగ్ చేసేందుకు 5, 6 రోజులు సమయం పడుతోంది.