అకాల వర్షాలతో రైతులు (Paddy Problems) అరిగోసపడుతున్నారు. హఠాత్తుగా కురుస్తున్న వానలకు కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అవడం చూసి సాగుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
రేయింబవళ్లు పడిగాపులు...
దాదాపుగా నెల నుంచి ధాన్యం మార్కెట్‌కు వచ్చిన స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడం వల్ల రైతులు కుప్పల (Paddy Problems) వద్ద రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నారు. వర్షానికి తేమ శాతం పెరగడం వల్ల అధికారులు కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. లారీల కొరత, టార్పాలిన్ కవర్లు లేకపోవడం సాగుదారులను వేధిస్తోంది. మిల్లర్లు సైతం అనేక కొర్రీలు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కువ నూక వస్తోందంటూ వడ్లను కొనేందుకు తిరస్కరిస్తున్నారు. హమాలీ ఖర్చులు, పట్టాల కిరాయి, ఇలా అనేకానేక సమస్యలతో సతమతమవుతున్నారు.
ధాన్యం వర్షార్పణం...
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టుకున్న ధాన్యం (Paddy Problems) వర్షార్పణమైంది. అనుకోకుండా కురిసిన వర్షానికి వెయ్యి బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు స్పందించి నిబంధనలను కొంత సడలించి వడ్లు కొనాలని వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోనూ వర్షం అన్నదాతలకు కు దుఃఖాన్ని మిగిల్చింది. నెల గడుస్తున్నా కొనుగోళ్లు చేయకపోవడం వల్లే తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించినా పెట్టుబడి సైతం రావడం గగనంగా మారిందని వాపోయారు.