* ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలకకు చెందిన రైతు వెంకయ్య ఓ బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించారు. రూ.3 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఆ ఏడాదికి కేవలం రూ.4 వేలు మాత్రమే వడ్డీ పడింది.
* ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రామారావు ఓ బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. రుణ మాఫీ వస్తుందని భావించి చెల్లించకుండా వదిలేశారు. ఐదేళ్లకు వడ్డీ ఇతర ఛార్జీల భారం కలిసి రూ.80,719 అయింది. ఇది అసలు రూ.లక్షకు అదనం.
సకాలంలో పంట రుణాలు చెల్లించకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పేందుకు ఈ ఇద్దరు రైతుల ఉదాహరణలే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పంట రుణాలను మాఫీ చేస్తోంది. రుణ మాఫీ పథకం కింద తుది దశలో ఇంకా రూ.లక్ష విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది రైతులు రుణాలను సకాలంలో చెల్లించటం లేదు. మాఫీ ప్రక్రియ ఐదేళ్లుగా సాగుతుండటంతో సకాలంలో రుణాలు చెల్లించని రైతులపై ఇప్పుడు వడ్డీ భారం తడిసి మోపెడవుతోంది. వచ్చే మాఫీలో అధికశాతం వడ్డీలకే సరిపోయే పరిస్థితి ఉంది. పంట రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో రైతులు మొండి ఖాతాదారులుగా మిగిలిపోతున్నారు.
రైతులకు తీరని నష్టం :సకాలంలో రుణం చెల్లించక సిబిల్ స్కోర్ తగ్గిపోయి బ్యాంకులు/ ఇతర వ్యాపార సంస్థల్లో రుణాలు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సకాలంలో పంట రుణాలు చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. రుణ మాఫీ వచ్చే వరకు నిరీక్షించటం వల్ల పడే వడ్డీ భారం గురించి అవగాహన కల్పిస్తున్నాయి. రుణాల రెన్యువల్‌కు, రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీకి ఎలాంటి సంబంధం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించినప్పటికీ చెల్లించకపోవటంతో అసలుతో కలిపి వడ్డీ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.
* రైతులు తమ పంట రుణాలను సంవత్సరం లోపల పునరుద్ధరించుకుంటే కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వడ్డీ రాయితీకి అర్హత పొందుతారు. ఏడాది లోపల పంట రుణం రెన్యువల్ చేసుకోని వారికి 14 శాతం అంటే రెండింతలు వడ్డీ పడుతుంది.
* ఉదాహరణకు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే...ప్రతి సంవత్సరం సక్రమంగా కట్టే రైతు 5 సంవత్సరాలకు చెల్లించే వడ్డీ రూ.20 వేలు మాత్రమే.