SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు సరిగా జరగకపోవడంతో చాలావరకు అభ్యసన నష్టపోయారు. ప్రైవేటులో ఆన్‌లైన్ తరగతులు జరిగినా విద్యార్థులు నేర్చుకున్నది తక్కువే. సెల్‌ఫోన్లకు అలవాటు పడడం, ఏకాగ్రత కోల్పోవడం, రెండు, మూడు గంటలపాటు ఒకేచోట కూర్చోలేకపోవడం, చేతిరాతలో వేగం కోల్పోవడం వంటివి విద్యార్థులకు సమస్యగా మారాయి. 2019-2020లో పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా అంతర్గత మార్కుల విధానం, ప్రత్యేక బిట్‌పేపర్‌ను తొలగించారు.
కానీ ఆ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. 2020-21లో 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లు, ఆ తర్వాత 7 పేపర్ల విధానం తీసుకొచ్చారు. ఈ ఒక్క (2021-22) ఏడాదికి ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో గ్రేడింగ్ విధానం ఉండగా..ఈసారి మార్కులను ప్రవేశ పెట్టారు. వేగం తగ్గిన చేతిరాత..కరోనా కారణంగా గత జులై వరకు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
నోటు పుస్తకాలు రాయడం తగ్గింది. దీంతో చేతిరాతలో వేగం మందగించింది. అసలు కొంతమంది విద్యార్థులు ఒకేచోట మూడు గంటలపాటు కూర్చోలేకపోతున్నారని జీవీబీఎస్‌ఎన్ రాజు అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఏకాగ్రతలోనూ మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. గణితంలో ఒక లెక్క చెప్పి, కొన్ని మార్పులతో మళ్లీ చేయమంటే చాలామంది తడబడుతున్నారని వెల్లడించారు. కొందరు పిల్లలు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఎక్కువ ఫోన్లతోనే గడుపుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారని.. ఆన్‌లైన్ తరగతులు, వాట్సప్‌లలో పాఠాల కారణంగా ఫోన్లకు అలవాటుపడిన వారు దాన్ని మానలేకపోతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఏడు పేపర్ల పరీక్షలో వంద మార్కులకు 3.15 గంటల చొప్పున సమయం ఇచ్చారు. అన్ని గంటలపాటు ఏకాగ్రతతో పరీక్ష రాసేలా పిల్లల్ని మానసికంగా సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టిసారించాలని సూచిస్తున్నారు.