తెలంగాణ

telangana

ETV Bharat / state

Different types of Dog Breeds : మీకు తెలుసా.. ఇవన్నీ శునకాలే..! - తెలంగాణ టాప్ న్యూస్

Different types of Dog Breeds : పక్షి అయినా జంతువు అయినా ఒక జాతికి చెందినవన్నీ ఒకేలా ఉండటం వాటి సహజ లక్షణం. రంగులోనో రూపు రేఖల్లోనో కొద్దిపాటి వైవిధ్యం ఉన్నప్పటికీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. అదే కోవలో శునకజాతిలోనూ అనేక రకాలు ఉన్నాయి. చిన్న చిన్న తేడాలున్నా చూడగానే అవన్నీ కుక్కలే అనిపిస్తాయి. కానీ కొన్ని మాత్రం అచ్చం వేరే జాతి అదీ జంతువుల్ని పోలి, ఇవి అసలు కుక్కలేనా అనిపించేలా ఉండటం విశేషం. కావాలంటే వీటిని చూడండి..!

Different types of Dog Breeds , wild animals dog breeds
విభిన్న జాతుల కుక్కలు

By

Published : Feb 6, 2022, 12:53 PM IST

Different types of Dog Breeds : శునకజాతిలోనూ అనేక రకాలు ఉన్నాయి. చిన్నచిన్న తేడాలున్నా కూడా... రకరకాల శునకాలను మనం గుర్తించవచ్చు. కానీ కొన్ని మాత్రం అచ్చం వేరే జాతి అదీ జంతువుల్లాగా ఉంటాయి. నిజంగా ఇవి కుక్కలేనా అనిపించేలా ఉంటాయి. వీటిని చూస్తే మీకే అర్థమవుతుంది.

రకూన్‌ కోతిలా...

చూడ్డానికి రకూన్లలానే ఉంటాయి టనుకి జాతి కుక్కలు. కాబట్టి వీటిని రకూన్‌ డాగ్స్‌ అనీ అంటారు. వీటి అరుపులు పిల్లి కూతల్ని పోలి ఉంటాయి. నీళ్లలోపలా అద్భుతంగా ఈదుకుంటూ వెళ్లి చేపల్నీ నాచుమొక్కల్నీ ఆహారంగా తింటుంటాయి. కోతుల మాదిరిగానే పండ్ల కోసం చెట్లూ అనాయాసంగా ఎక్కేస్తాయి. ఫాక్స్‌ ఫర్‌గా అమ్ముతున్న దుస్తుల్లో 70శాతం వరకూ ఈ కుక్కల నుంచి తీసిన బొచ్చుతో చేసినవేనట. అందుకే చైనా, ఫిన్‌ల్యాండ్‌ దేశాల్లో ఫర్‌ కోసం వీటిని చంపేస్తుంటారు. సంతానోత్పత్తి సమయంలో మగ కుక్కలు ఆడవాటికి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టడమేగాక, పప్పీలకు నాలుగు నెలలు వచ్చేవరకూ వాటిని జాగ్రత్తగా సాకే లక్షణాన్ని వీటిలో చూడొచ్చు. కుక్క జాతుల్లో ఈ ఒక్కటి మాత్రమే చలికాలంలో సుషుప్తావస్తలోకి వెళతాయి.

కొండముచ్చులా..!

కీస్‌హాండ్‌... నలుపూ బూడిదరంగూ కలగలిసిన రంగులో నిండైన బొచ్చుతోనూ నల్లని ముఖంతోనూ ఉండే ఈ జాతి కుక్క ఇండియన్‌ లంగూర్‌ జాతి కోతిని తలపిస్తుంటుంది. అందుకే వీటిని కోతి కుక్కపిల్ల అంటుంటారు. పమేరియన్లలా చిన్నగా చూడ్డానికి సాఫ్ట్‌టాయ్స్‌లా ఉండటంతో వీటిని చాలామంది ఇష్టంగా పెంచుతుంటారు. పైగా ఏది చెప్పినా త్వరగా నేర్చుకుంటాయివి. పిల్లలతో బాగా ఆడుకుంటాయి. ఒకప్పుడు డచ్‌ యాత్రికులు తోడుగా ఉండేందుకూ కాపలాకోసమూ వీటిని ఓడల్లో తీసుకెళ్లేవారట. ప్రస్తుతం ఆసుపత్రుల్లో థెరపీ కోసం ఎక్కువగా పెంచుతున్నారు. అమెరికాలోని ట్విన్‌టవర్స్‌మీద జరిగిన బాంబుదాడిలో గాయపడిన అనేకమంది వీటి థెరపీ కారణంగానే త్వరగా కోలుకున్నారట. ఇంట్లో ఎక్కువసేపు ఒంటరిగా వదిలేస్తే మాత్రం ఆందోళనకు లోనయి ఇల్లంతా చెల్లాచెదురుచేసేస్తాయట.

ఎలుగుబంటిలా..!

బుష్‌, సవన్నా, వినెగర్‌ డాగ్స్‌ అని పిలిచే ఈ కుక్కలు చూడ్డానికి చిన్న సైజు ఎలుగుబంట్లలా కనిపిస్తాయి. వీటి మూత్రం వినెగర్‌ వాసన వస్తుంది కాబట్టి ఆ పేరుతోనూ పిలుస్తుంటారు. వీటికి సిగ్గెక్కువ. ఈతకొట్టడంలో మాత్రం వీటి ప్రతిభ అపారం. నీళ్లలోపలా అత్యంత సునాయాసంగా ఈదగలవు. పిట్టల్నీ చిన్న చిన్న జంతువుల్నీ వేటాడి తింటుంటాయి. ఇవి మందలుగా జీవిస్తుంటాయి. ఒక్కో మందలో పన్నెండు వరకూ ఉంటాయి. కానీ ఎక్కువగా ఒంటరిగానే వేటకు వెళతాయి. మగ కుక్కలే ఆడవాటికీ పిల్లలకీ ఆహారాన్ని తీసుకొస్తుంటాయి. ఆరు బుష్‌ డాగ్స్‌ కలిసి 250 కిలోల బరువున్న పందిలాంటి టాపిర్‌ జంతువుని కూడా చంపగలవు. వేటాడేటప్పుడు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక వర్గం ఆ జంతువుని నీళ్ల దగ్గరకి తరిమితే మరో వర్గం నీళ్లలో దానికోసం కాచుకుని ఉంటుందట.

హైనాలా...

అటు కుక్కా ఇటు పిల్లీ కానీ జంతువే హైనా. దాన్ని తలపించేలా ఉంటుందీ ఆఫ్రికన్‌ వైల్డ్‌ డాగ్‌. గంటకి 37 నుంచి 44 మైళ్లు సునాయాసంగా పరిగెత్తే ఇవి అద్భుతమైన వేట కుక్కలు. ఒంటిమీద ఉన్న మచ్చల కారణంగా వీటిని పెయింటెడ్‌ డాగ్స్‌ అనీ పిలుస్తారు. మామూలు కుక్కలకు భిన్నంగా వీటి కాళ్లు పొడవుగానూ చెవులు గుండ్రంగానూ ఉంటాయి. మందలుగా జీవిస్తాయి. ఒక్కో గ్రూపులో రెండు నుంచి ముప్ఫై వరకూ ఉంటాయి. ఏదైనా ఒకటి గాయపడితే అది కోలుకునేవరకూ మిగిలినవి ఆహారం తీసుకొస్తాయట. అలాగే ఒక కుక్క తప్పిపోతే గుడ్లగూబలా కూత పెట్టి మరీ మందని పిలుస్తుందట. సైజులో చిన్నగా ఉన్నప్పటికీ ఇవి ఎంత పెద్ద జంతువునైనా- ఉదాహరణకు వైల్డ్‌ బీస్ట్‌ లాంటివాటినయినా సరే వేటాడగలవు. వీటిలో ఏ రెండు కుక్కలకీ ఒకే రకమైన మచ్చలు ఉండవట. కాబట్టి గుర్తించడం తేలిక.

సింహంలా...

పెద్ద తల, భారీ పరిమాణం, జూలులా ఉండే బొచ్చూ కారణంగా అచ్చం సింహంలానే కనిపిస్తాయి టిబెటన్‌ మాస్టిఫ్స్‌. ఆకారం భయం కలిగించినా ఒకసారి మచ్చిక చేసుకుంటే చాలు, యజమానిచెప్పినట్లు వినడమే కాదు, విశ్వాసంగానూ ఉంటాయి. నేపాల్‌, ఉత్తర భారతదేశం, భూటాన్‌ దేశాల్లో వీటిని కాపలా కోసమే ఎక్కువగా పెంచుతారు. పగలంతా కట్టేసి ఉంచి, రాత్రిపూట వదిలేస్తే ఇంటి చుట్టూ తిరుగుతూ గస్తీ కాస్తాయివి. ఎవరైనా పనిగట్టుకుని కవ్విస్తేనే కోపంతో మీదికొస్తాయట. లేదంటే వీటికి చాలా ఓపిక. రెండు టిబెటన్‌ మాస్టిఫ్స్‌ కలిసి సింహాన్ని కూడా చంపగలవట. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ జీవిస్తాయి కానీ చల్లని వాతావరణం అంటే ఇష్టమట. పక్షుల వేట అంటే మాత్రం ఈ శునక సింహాలకి భలే ఇష్టం.

తోడేలులా...

తోడేలు నుంచే కుక్క పుట్టుకొచ్చింది కాబట్టి కొన్ని కుక్కజాతులు తోడేళ్లని పోలి ఉంటాయి.. కానీ వుల్ఫ్‌ డాగ్స్‌ అచ్చంగా తోడేలునే తలపించడం విశేషం. వీటినే అలాస్కన్‌ మాలామ్యూట్‌ అంటారు. ఈ జాతి ఐదు వేల ఏళ్ల నుంచీ మనిషికి తోడుగా ఉంటోంది. మంచు ప్రాంతాల్లో స్లెడ్జ్‌ డాగ్స్‌గా పనిచేసేదీ ఈ జాతి కుక్కలే. ఇవి పెద్దగా అరవవు కానీ తోడేలు మాదిరిగా కూత వేస్తుంటాయి. వేటలోనూ పనుల్లోనూ యజమానికి ఎంతో సాయపడతాయి. పోస్టల్‌ డ్యూటీ, సరుకుల రవాణా... ఇలా ఏ పని చెప్పినా చేస్తాయివి. మొదటి, రెండో ప్రపంచయుద్ధ సమయాల్లో సరకుల్ని చేరవేసేందుకూ బాంబుల్ని గుర్తించేందుకూ ఆయుధాల్ని తరలించేందుకూ ఇవి ఎంతో సాయపడ్డాయి. అందుకే ఈ తోడేలు కుక్క మనిషికి చిరకాల నేస్తం అని చెప్పుకోవాలి..!

గొర్రె పిల్లలా..!

చూడ్డానికి అమాయకంగా గొర్రె పిల్లల్లా ఉంటాయీ బెడ్‌లంగ్టన్‌ టెర్రెయిర్స్‌. కానీ అద్భుతమైన వేట కుక్కలివి. వేగంగా పరిగెత్తగలవు. అంతే వేగంగా ఈత కొట్టగలవు. అలాగని వీటిని చూసి భయపడక్కర్లేదు. స్నేహంగానూ పిల్లలంటే ఇష్టంగానూ ఉంటాయి. హాయిగా పెంచుకోవచ్చు. అరుపులు ఎక్కువ. కాబట్టి ఊరికే అరవకుండా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 16 నుంచి 17.5 అంగుళాలు మాత్రమే పెరిగే ఈ కుక్కలు చూడ్డానికి సాఫ్ట్‌టాయ్స్‌లా ఉంటాయి. కానీ వీటికి గుండెధైర్యం చాలా ఎక్కువ. డాగ్‌ స్పోర్ట్స్‌కోసం కూడా వీటిని పెంచుతుంటారు. డాగ్‌ ఫైట్స్‌కీ పంపిస్తారు. బరిలోకి వదిలితే పతకాన్ని తీసుకురాకుండా వెనుతిరగవట. వేటకి పంపిస్తే చిన్నపాటి కుందేల్నయినా పట్టకుండా తిరిగిరావట. అందుకే చూపులకి గొర్రె కానీ స్వభావానికి సింహం అంటుంటారు. పూర్వం జిప్సీలు ఎక్కువగా పెంచేవారు. ఎందుకంటే కాపలా కూడా అంత బాగానే కాస్తాయీ గొర్రె కుక్కలు. ఇంటికి వచ్చినవాళ్లతో స్నేహపూర్వకంగానే మెలుగుతాయి. కానీ వచ్చిన వాళ్లేమైనా యజమానితో కాస్త తేడాగా ప్రవర్తిస్తే చీల్చి చెండాడతాయి. వీటిని ఎంత నడిపిస్తే అంత మంచిది. అప్పుడే ఆనందంగా ఉంటాయి. అలాగని మళ్లీ వేరే జాతి కుక్కల్ని అంతగా సహించవు కాబట్టి బయటకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగానే ఉండాలి సుమీ.

నక్కలా..!

కుక్కకీ నక్కకీ కొన్ని పోలికలు ఉండటం సహజమే కానీ అచ్చం నక్కలా ఉండేవీ ఉన్నాయి. అదే డౌల్‌... ఈ బ్రీడ్‌ కుక్కలు ఆసియా దేశాల్లోనూ మనదేశంలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. దీన్నే ఇండియన్‌ వైల్డ్‌ డాగ్‌ అనీ, ఎర్ర కుక్క అనీ అంటారు. పైగా ఇది నక్కలానే అరుస్తుందట. దీని తోక కూడా నక్క తోకలానే ఉంటుంది. ఇవి లేళ్లనీ అడవి పందుల్నీ దున్నల్నీ మేకల్నీ కూడా తినేస్తాయి. అదేసమయంలో బెర్రీ పండ్లనీ చిన్న చిన్న పురుగుల్నీ బల్లుల్నీ కుందేళ్లనీ కూడా తింటుంటాయట. పులితో సైతం పోరుకి దిగే ఈ కుక్క, దానికన్నా పదింతలకు పైగా బరువున్న వాటిని సైతం వేటాడుతుంది. సకిలింతలూ ఈలలూ అరుపులూ... ఇలా రకరకాల శబ్దాలు చేస్తూ ఒకదాంతో ఒకటి అద్భుతంగా మాట్లాడుకుంటాయివి. నక్కల్లానే వేటకోసం చక్కటి వ్యూహాల్నీ పన్నుతాయి. ఎలా వేటాడాలో కూడా వాటిదైన భాషలో చెప్పుకుంటాయి. ఈత పుట్టుకతో అబ్బిన విద్య. మరీ వేగంగా పరిగెత్తలేవు కానీ ఏడడుగుల ఎత్తు వరకూ గాల్లోకి లేస్తాయీ నక్క కుక్కలు.

ఇదీ చదవండి:Terrace garden: వారికి మొక్కలంటే ప్రాణం.. అందుకు వారు ఎంచుకున్న మార్గమిదే..

ABOUT THE AUTHOR

...view details