తెలంగాణ

telangana

ETV Bharat / state

వైసీపీ నేతల నయా దందా.. డీజిల్ వ్యాపారంతో ఖజానాకు చిల్లు - YCP Leaders scams

Anantapur YCP leaders Diesel Scam : అవకాశం వస్తే చాలు గుడినే కాదు.. అందులోని లింగాన్నీ మింగేద్దాం అన్నట్టుంది.. వైసీపీ నాయకుల వైఖరి. ఆదాయం వచ్చే ఏ అవకాశాన్నీ వదలని నేతలు.. అక్రమాలను సక్రమం చేస్తూ తప్పించుకుంటున్నారు. కర్ణాటక నుంచి డీజిల్‌ను తక్కువ ధరకు కొని.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. వారికి ధన దాహానికి సహకరించిన అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నారు.

వైసీపీ నేతల నయా దందా
వైసీపీ నేతల నయా దందా

By

Published : Nov 27, 2022, 3:52 PM IST

వైసీపీ నేతల నయా దందా.. డీజిల్ వ్యాపారం.. ఖజానాకు రోజుకు కోటిపైనే నష్టం

Anantapur YCP leaders Diesel Scam : ఆర్టీసీ డిపోలకు అందరికంటే ఒక రూపాయి తక్కువ ధరకే డీజిల్‌ సరఫరా చేస్తాం. మాకు అనుమతివ్వండి అంటూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని బంకుల యజమానులు ముందుకొస్తున్నారు. అంతే కాదు సరఫరా చేస్తున్నారు కూడా.. తక్కువ ధరకు డీజిల్‌ ఇస్తే మంచిదే కదా.. కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఎంతోకొంత కలిసొస్తుందని అనుకుంటే పొరపాటే. వారంతా కర్ణాటక నుంచి డీజిల్‌ తెప్పించి ఇక్కడ అమ్ముతున్నారు.

రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో లీటరు డీజిల్‌ దాదాపు 9 రూపాయల 70 పైసలు తక్కువ. రూపాయి తక్కువకే ఇస్తామని చెప్పి ప్రతి లీటరుపై ఎనిమిది రూపాయల లాభాన్ని జేబులో వేసుకుంటున్నారు. వైసీపీ నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. వాణిజ్య పన్నులశాఖ అధికారులు ట్యాంకర్లను పట్టుకుంటే రాష్ట్రంలోనే కొన్నట్లు పత్రాలు సృష్టించి తప్పించుకుంటున్నారు.

డీజిల్‌ దందాతో రోజూ ఖజానాకు కోటి రూపాయల వరకు గండికొడుతున్నారు . అనంతపురంలో ప్రస్తుతం డీజిల్‌ ధర లీటరు 99 రూపాయల 42 పైసలు. ఇందులో రాష్ట్రానికి వ్యాట్‌ రూపంలో 22.25 శాతం, ప్రతి లీటరుపై 4 అదనపు వ్యాట్‌, 1 శాతం రోడ్డు సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరుపై 27 చేరుతుంది. డీజిల్‌ను కర్ణాటకలో కొనడం వల్ల మన రాష్ట్రానికి ప్రతి లీటరుపై 27 నష్టం వాటిల్లుతోంది.

ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రోజుకు లక్ష లీటర్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతిరోజు 27 లక్షల ఆదాయం కోల్పోతున్నాం. ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని అత్యధిక ఆర్టీసీ డిపోలకు, జేసీబీ, లారీల యజమానులకు కర్ణాటక డీజిల్‌నే సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రోజుకు కోటికి పైగా నష్టం వాటిల్లుతోంది. కర్ణాటక డీజిల్‌ దందా వెనుక గుంతకల్లుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

వీరికి అనంతపురంతో పాటు కర్ణాటకలోనూ పెట్రోలు బంకులున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తనయుడి అండతో.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని ప్రాంతాలకు డీజిల్‌ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో సంబంధిత అధికారులకు ఒక్కో ట్యాంకరుకు 20వేల చొప్పున ముడుపులు అందుతున్నట్లు సమాచారం.

డీజిల్‌ను తక్కువ ధరకు సరఫరా చేయడం వల్లే కొంటున్నామని డిపోమేనేజర్లు చెప్తున్నారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అక్టోబరు 17న ఒక డీజిల్‌ ట్యాంకర్‌ను అధికారులు పట్టుకున్నారు. హిందూపురంలోని ఓ పెట్రోల్‌ బంకు నుంచి వచ్చినట్లు పత్రాలు చూపించగా అవి నకిలీవని తేల్చారు. ట్యాంకరు కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్‌ చేసి 6లక్షల 4 వేల జరిమానా విధించారు.

సెప్టెంబరులో వాణిజ్య పన్నులశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో పెనుకొండలోని ఓ పెట్రోలు బంకులో భారీగా అవకతవకలు గుర్తించారు. 5 కోట్ల వరకు పన్నులు ఎగ్గొట్టినట్లు తేల్చి.. 10 కోట్లు జరిమానా విధించారు. డీజిల్‌ దందా అంతా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుగుదేశం ఆరోపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటక డీజిల్‌ సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నులు శాఖ అదనపు కమిషనర్‌ నీరజ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details