తెలంగాణ

telangana

ETV Bharat / state

Diesel Price: పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్థిక భారం

డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల ప్రజా, సరుకు రవాణావ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వీటి నిర్వహణ యాజమాన్యానికి ఆర్థిక భారమైపోతోంది. ఫలితంగా నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం పడుతోంది. డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లారీల నిర్వాహకులు కోరుతున్నారు.

By

Published : Jun 15, 2021, 1:31 PM IST

diesel-rates-hike-effect-on-transportation
Diesel Price: రోజురోజుకు పెరుగుతున్న ధరలు.. పెరుగుతున్న ఆర్థిక భారం

డీజీల్ ధరలు ప్రతి దానికి ముడిపడి ఉంటాయి. రవాణా ఛార్జీలు పెరిగితే.. దాని ప్రభావం నిత్యావసర సరుకులైన పాలు, కూరగాయాలు, పండ్ల ధరలపై ప్రభావం చూపిస్తుంది. గడిచిన వారం రోజుల్లో నాలుగు సార్లు డీజీల్ ధరలు పెరగడంతో లారీల నిర్వహణ భారంగా మారుతుందని యజమానులు వాపోతున్నారు. అసలే గతేడాది కరోనా ప్రభావంతో నష్టాలు చవిచూశామని... ఈసారి లాక్​డౌన్​తో రవాణా సరిగ్గా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. లారీల నిర్వాహకులు మండిపడుతున్నారు. దీనికితోడు వరుసగా డీజీల్ ధరలు పెంచడంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటున్నారు. ఒక లారీ బయలుదేరి గమ్యస్థానానికి చేరుకునేలోపు... డీజీల్ ధరలు కనీసం రెండు సార్లు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఆలోపు ఛార్జీలు పెంచలేక.. ముందు మాట్లాడిన ధరలు తీసుకోలేక.. ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా 50వేల పైచిలుకు లారీలున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్​లోనే సుమారు 40వేల లారీలు సరుకు రవాణా చేస్తున్నాయి. గృహ నిర్మాణ, వస్తు సామాగ్రి రవాణా చేయడానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటితో పాటు కొందరు టీఎస్ఎండీసీ సంస్థ దగ్గర ఆన్​లైన్​లో డబ్బులు చెల్లించి ఇసుక బుక్ చేసుకుని రవాణా చేస్తుంటారు. గిరాకీ మాట్లాడుకుని వాటిని గమ్యస్థానానికి చేర్చేలోపు.. డీజీల్ ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావడంలేదని లారీల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో గడిచిన వారం రోజుల్లో నాలుగు సార్లు డీజీల్ ధరలు పెరిగాయి. జూన్ 8న రూ.93.99లు, 9న రూ.94.26లు(27పైసలు పెరిగింది), 10న రూ.94.26, 11న రూ.94.57లు (31పైసలు పెరిగింది), 12వ తేదీన రూ.94.82లు(25పైసలు పెరిగింది), 13న రూ.94.82లు, 14న రూ.95.14(32పైసలు పెరిగింది). ఇలా వరసగా డీజీల్ ధరలు పెరుగుతూ పోతుంటే ఎలా బతికేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టి లారీలు కొన్నాం... వాటిని నడిపేందుకు వీలు లేకుండా నిత్యం డీజీల్ ధరలు పెరగుతున్నాయని వాపోయారు. వీటికి తోడు రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు చెల్లించడంతో పాటు.. అప్పుడప్పుడు లారీ మరమ్మత్తులకు ఖర్చులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కనెల కిస్తి కట్టకపోయినా... ఫైనాన్షియర్లు లారీలను తీసుకెళ్తున్నారన్నారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ. ఇప్పటికే నష్టాల్లో ఉన్న దీనికి డీజీల్ ధరలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు డీజీల్​పై టాక్స్ పెరుగుతూనే ఉంది. 2014-15లో 43.80శాతం డీజీల్ టాక్స్ ఉంటే... 2020-21లో 129.12శాతం వరకు పెరిగిపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆర్టీసీకి విక్రయించే డీజీల్​పై 15శాతం రాయితీ ఉండేదని.. ఇప్పుడు బహిరంగ మార్కెట్ ధరకే డీజీల్ కొనుగోలు చేయడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఏటా డీజీల్​పై వందల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చూడండి:Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details