తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో వ్యాధి నిర్ధరణ కేంద్రాలు - Diagnostic Centers in telangana

ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం, కాలుష్యం ప్రభావంతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వ్యాధి చికిత్స కంటే.. రోగ నిర్ధరణకే వివిధ పరీక్షలంటూ ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడినా... నిర్ధరణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం.. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

Diagnostic Centers under the name of Telangana Diagnostic Hub
తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో వ్యాధి నిర్ధరణ కేంద్రాలు

By

Published : Mar 5, 2021, 7:04 AM IST

కొన్నేళ్లుగా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంపై సర్కార్‌ ప్రత్యేకదృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, కేసీఆర్​ కిట్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. సేవల్లో అభివృద్ధి ఉన్నా... వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లనే అశ్రయించాల్సి వచ్చేది. ప్రైవేటు సంస్థల దోపిడీకి గురై ప్రజల జేబులు ఖాళీ అయిన ఘటనలు అనేకం. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వమే స్వయంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన సర్కారు.... కరీంనగర్‌, సిరిసిల్లలోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన పరికరాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

25 రకాల కీలక పరీక్షలు

ఈ పథకంలో భాగంగా మౌలికవసతుల కల్పన, పరికరాల కొనుగోలుకు ఒక్కో జిల్లాకు రెండున్నర కోట్లు కేటాయించింది. ఈ డయాగ్నోస్టిక్ హబ్‌లలో సాధారణ పరీక్షల నుంచి.. థైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, మెదడు, వెన్నుపూసలకు సంబంధించి... 25 రకాల కీలక పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్ పనులన్నీ పూర్తి చేసుకోవడంతో.. ప్రస్తుతం డ్రైరన్ నిర్వహిస్తున్నారు.

నమూనాలు సేకరణ

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే డయాగ్నోస్టిక్ హబ్‌కు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రులను అనుసంధానం చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో నమూనాలు సేకరించి హబ్‌కు తరలించి.. నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. అన్నీ ప్రభుత్వాసుపత్రుల సిబ్బందికి... రోగుల నుంచి నమూనాలు సేకరణ, వాటిని భద్రపరిచి ల్యాబ్‌లకు పంపించే విధానంపై శిక్షణ ఇచ్చారు.

త్వరలోనే ఇప్పుడున్న వాటికి అదనంగా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :అర్ధరాత్రి ఆందోళన చేసిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details