Diabetic Foot Care: ఒకప్పుడు వయసు ప్రభావంతోనో లేక వంశపారం పర్యంగానో మధుమేహం సంక్రమించేది. అది కూడా ఎక్కువగా 50 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తే సుమారు 13 లక్షల మందికి డయాబెటిస్ నిర్ధరణ అయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక డయాబెటిస్ సోకిన వారికి చిన్న గాయమైనా.. మానటం కాస్త కష్టమే. మరోవైపు మధుమేహం సోకి పదేళ్లు దాటిన వారిలో క్రమంగా కాళ్లు స్పర్శ కోల్పోవటం, పుండ్లు ఏర్పడటం జరుగుతుంటాయి. అలాంటి వారికి సరైన చికిత్స అందించకపోతే ఒక్కోసారి కాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇలాంటి వారి కోసమే ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 'డయాబెటిక్ ఫూట్ కేర్ క్లినిక్'కి విశేష స్పందన వస్తోంది.
నెల రోజుల్లోనే 600 మందికి..: రాష్ట్రవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల సంఖ్య పెరుగుతున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వ విభాగంలో ప్రత్యేకంగా ఫూట్ కేర్ క్లినిక్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఇటీవల ఈ క్లినిక్ ప్రారంభించారు. నెల రోజుల్లోనే దాదాపు 600 మంది రోగులకు సేవలు అందించినట్లు వైద్యలు తెలిపారు. ఎండోక్రైనాలజీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వంటి అన్ని విభాగాల వైద్యులను ఒక్కచోట్ల చేర్చి ఏర్పాటు చేసిందే ఈ ఫూట్ కేర్ క్లినిక్. ఇక్కడికి వచ్చే రోగుల చక్కెర స్థాయిలు పరీక్షించటంతోపాటు.. భవిష్యత్తులో న్యూరోపతి బారినపడే అవకాశం ఉందా అన్న పరీక్షలు, గాయంతో వచ్చే వారికి డ్రెస్సింగ్ సహా అవసరమైన సర్జరీలు, మందులు ఉచితంగా అందిస్తారు.
రోగుల సంతృప్తి..: ప్రైవేటులో వేలల్లో ఖర్చు చేయాల్సిన ఈ సేవలు.. ఉస్మానియా ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తుండటంపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఫూట్ కేర్ క్లినిక్ సేవలను మరింత విస్తరించాలని భావిస్తున్నారు.