Diabetes: భారతీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ బాధితులు కావొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జనాభా నిర్దిష్ట జన్యుపర వ్యత్యాసాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. విభిన్న వర్గాల జనాభాపై ప్రపంచవ్యాప్త అధ్యయనం చేపట్టారు. ఇప్పటివరకు ఈ తరహా అధ్యయనాలు ఎక్కువగా యూరోపియన్ పూర్వీకుల జనాభాపై చేపట్టారు. అయితే ఇటీవలి కాలంలో మధుమేహ ముప్పును దక్షిణాసియా, భారత్, చైనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ప్రముఖ పరిశోధకుల్లో ఒకరైన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ ఆర్ చందక్ ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ అధ్యయనం చేపట్టారు.
యూరోపియన్లతో పోలిస్తే భారతీయుల్లో జన్యుపరమైన వైవిధ్యం ఎక్కువ కావడంతో యూరోపియన్ డేటాను ఉపయోగించి భారతీయ జనాభాలో టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేశారు. మధుమేహంతో బాధపడుతున్న 1.8 లక్షల మంది వ్యక్తుల డీఎన్‌ఏను అయిదు పూర్వీకుల సమూహాలకు చెందిన 11.6 లక్షల సాధారణ నమూనాలతో పోల్చారు. ఈ సమూహాల్లో యూరోపియన్లు, తూర్పు ఆసియా వాసులు, దక్షిణాసియా వాసులు, ఆఫ్రికన్లు, హిస్పానిక్‌లు ఉన్నారు. ఈ అధ్యయనం ఫలితాల ఆధారంగా భారతీయుల్లో ప్రతి ఆరో వ్యక్తి మధుమేహ బాధితుడు కావొచ్చని తేలిందని డాక్టర్ గిరిరాజ్ చందక్ పేర్కొన్నారు. దక్షిణాసియా జనాభాను మరింతగా పరిశోధించడానికి, కచ్చితమైన ఔషధం అభివృద్ధికి ఈ పరిశోధన దోహదం చేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. డయాబెటిస్ మెటా-ఎనాలలిస్ ఆఫ్ ట్రాన్స్ ఎత్నిక్ అసోసియేషన్ పేరుతో చేపట్టిన ఈ అధ్యయనం తాజాగా నేచర్ జెనిటిక్స్‌లో ప్రచురితమైంది.