Spouse Teachers Dharna: భార్య భర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఉపాద్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయ దంపతులు చాలా మంది ధర్నాకు హాజరయ్యారు.
తరువాత ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్ కార్యాలయం రోడ్డుపై బైఠాయించి.. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులలో చిన్నారులపై సైతం పోలీసులు దారుణంగా ప్రవర్తించడంతో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు విలపించారు.
మరో పక్క కొంతమంది పోలీసులు చిన్నారులను చేరదీసి.. వారి తల్లిదండ్రులను ఈడ్చుకుంటూ వాహనాలలో తోసివేశారు. దీంతో గంటపైగా అరెస్ట్‌ల పరంపర కొనసాగడంతో.. కొంతమంది ఉపాధ్యాయులకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం.. మరో 13జిల్లాల్లో ఆపేయడం న్యాయమా అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు.