Dharani problems: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ బదిలీ, గిఫ్ట్ డీడ్ తదితర లావాదేవీల్లో స్తబ్దత నెలకొంది. అయిదు రోజుల నుంచి ధరణి పోర్టల్ సతాయిస్తుండగా సోమవారం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రైతుల ఖాతాల నుంచి డబ్బులు కోతపడగా అవి ఎక్కడికి వెళ్లాయో తెలియకుండానే సైట్లు మూతపడ్డాయి. మరోపక్క మంగళవారం నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలుకానుండటంతో తమకు పాతధరలు వర్తిస్తాయో లేదో అనే సందిగ్ధంలో వీరున్నారు. అయితే అదనపు చెల్లింపులు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 25వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ల నమోదులో ఆటంకాలు ప్రారంభమయ్యాయి. మీసేవా, ఆన్‌లైన్ ద్వారా స్లాట్లు తీసుకోవడంతో గంటల తరబడి జాప్యం చోటు చేసుకుంది. మీసేవా కేంద్రాల ద్వారా చేసిన స్లాటు బుకింగ్‌లలో కొన్ని జిల్లాల్లో పేమెంట్స్ ప్రక్రియ పూర్తయినా లావాదేవీ సంఖ్యను సూచించే విండో తెరుచుకోలేదు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొంపల్లి సమీపంలో ఓ భూమికి సంబంధించి అయిదు లావాదేవీలకు చెల్లింపులు చేసి స్లాటు నమోదు చేయగా, రూ.లక్ష మొత్తానికి సంబంధించిన ఒక స్లాటు మధ్యలోనే నిలిచిపోయింది. డబ్బులు ఎక్కడికి పోయాయనేది తెలియలేదు. దీంతో అతను ధరణి టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆరాతీశారు. అయినప్పటికీ సోమవారం రాత్రి వరకు సమాచారం లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఇదే తరహాలో జిల్లాల్లో పలు చోట్ల స్తంభించిపోవడంతో గందరగోళం చోటుచేసుకుంది.
ధరలు సవరించినపుడు గతంలోనూ ఇదే స్థితి