Congress Leaders On Dharani Portal : అసెంబ్లీ ఎన్నికల పోరు దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి రాజుకున్న రాష్ట్రంలో.. ధరణి పోర్టల్ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పతాకస్థాయికి చేర్చింది. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న కాంగ్రెస్ నేతల మాటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో బహిరంగ సభల్లో ధరణి పోర్టల్ కేంద్రంగానే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించానన్న కేసీఆర్.. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశామని తెలిపారు. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతు బీమా అమలవుతోందని, రైతు బొటనవేలితో మాత్రమే భూమి వివరాలు మారతాయని స్పష్టం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే వాళ్లనే సముద్రంలో వేయాలని కేసీఆర్ సభల్లో పిలుపునిచ్చారు.
Revanth Reddy About Dharani Portal : ధరణి పోర్టల్‌ను నిలిపివేయడంపై కాంగ్రెస్ పార్టీ మరింత స్వరాన్ని పెంచింది. ధరణికి వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ.. దానిని బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించింది. దీనిపై కేసీఆర్ ఎదురుదాడిని తప్పుపట్టిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రైతు డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ధరణిని బరాబర్ రద్దు చేసి తీరతామని పునరుద్ఘాటించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే కేసీఆర్ ధరణిని తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు.