భూసంబంధిత లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగేలా కొత్త రెవెన్యూ విధానం రేపట్నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ ద్వారా ఇకనుంచి భూలావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానం తరహాలో జరగనున్నాయి. ఇందుకోసం ధరణి పోర్టల్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు పోర్టల్‌లో వేర్వేరుగా చోటు కల్పించారు. కొత్త రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు, తదితర లావాదేవీలన్నీ ఇకనుంచి ధరణి ద్వారానే జరగనున్నాయి. పోర్టల్‌లో భూములు, ఆస్తుల సమాచారం, నిషేధిత జాబితాలోని భూములు, ఎన్ కంబరెన్స్ సహా స్టాంపు డ్యూటీ నిర్ధరణ కోసం భూముల వారీగా మార్కెట్ విలువను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పోర్టల్ ద్వారానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తహసీల్దార్ల వద్దే..
ఇకనుంచి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు తహసీల్దార్ల వద్దే జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 570 గ్రామీణ ప్రాంత తహశీల్దార్లు ఇకనుంచి సంయుక్త సబ్రిజిస్ట్రార్లుగా కూడా వ్యవహరిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ రుసుము ఆన్లైన్ లేదా చలాన్ ద్వారా చెల్లించి డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకోవాలి. నిర్ణీత సమయంలో అమ్మకందారు, కొనుగోలుదారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఫొటోలు, సంతకాలు, సాక్షులు సంబంధిత ప్రక్రియ పూర్తి చేసుకున్నాక అన్ని వివరాలను పరిశీలించి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్కానింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి డాక్యుమెంట్‌ను ఇస్తారు. పాసుపుస్తకాల్లో ఆ వివరాలు నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే మ్యుటేషన్ కూడా పూర్తి చేస్తారు.