Dharani Portal issues: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ- లీఫ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ భూమి కారవాన్ ఆరంభమైంది. ఆచార్య వినోభా భావే మొదటి భూదానం స్వీకరించిన చెట్టు కింద నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, సుప్రీం కోర్టు న్యాయవాది లీఫ్స్ సంస్థ నేతృత్వంలో గ్రామాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ధరణితో ఏ మేరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయి..? ఇంకా మిగిలిన సమస్యలేంటని రైతులతో మాట్లాడి సమాచారం సేకరిస్తున్నారు.
Telangana Land Caravan : సమగ్ర భూ సర్వే జరిపితే లోపాలు పరిష్కరించడానికి వీలవుతుందని న్యాయవాది నిరూప్‌రెడ్డి సూచించారు. భూదాన్ పోచంపల్లి నుంచి గుడిమల్కాపురం మీదుగా మల్లేపల్లి వరకు సాగిన ఈ కారవాన్‌లో సమస్యలు వెల్లువెత్తాయి. ధరణిలో సర్వే నెంబర్లు, పేర్లు, పొజిషన్ల్ తప్పుగా నమోదవటం, రికార్డుల్లో పొరాపాట్లు వంటి అనేక ఇబ్బందులను న్యాయ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అనేక మంది రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాదాబైనామాలకు హక్కులు రాక వివిధ అవసరాల నిమిత్తం భూమి అమ్ముకోలేక పోతున్నామని న్యాయ నిపుణుల ఎదుట వాపోయారు.