చెన్నయ్ లాంటి నగరాల మాదిరిగా హైదరాబాద్‌లో నీటి సమస్య అంతగా లేదని జలమండలి ఎండీ దానకిషోర్ స్పష్టం చేశారు. ఆగస్టు మాసాంతానికి కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేశవపురం, దేవులమ్మ నాగారం రిజర్వాయర్ పనులు వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎండీ దానకిషోర్ మాట్లాడారు. నగరానికి ప్రస్తుతం గోదావరి నుంచి 172 ఎం.జీ.డీలు, కృష్ణా నుంచి 270 ఎం.జీ.డీల నీళ్లు అందజేస్తున్నామని వివరించారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం తగ్గినా ఇంకా ఐదేళ్ల వరకు నగరానికి మంచినీటికి ఢోకా ఉండదన్నారు.
ప్రస్తుతం నగరానికి 420 ఎం.జీ.డీల నీళ్లను అందిస్తున్నామని అవసరమైతే 468 ఎం.జీ.డీల నీళ్లు ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నామన్నారు. భూగర్బజలాలు అడుగంటి పోవడంతో మంచినీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో రోజుకు 50ఎంజీడీల నీళ్లు వృథాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.