కరోనా, డీహెచ్ శ్రీనివాస రావు కరోనా మూడో దశ పట్ల ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ను సమర్థవంతంగా అరికట్టుతున్నామన్న డీహెచ్... సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో వైద్య విద్యా డైరెక్టర్ రమేశ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
వ్యాక్సిన్ నిల్వ
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతం 9.25 లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందని పేర్కొన్నారు. 16శాతం పడకల్లో మాత్రమే కరోనా రోగులు ఉన్నారని అన్నారు. ఆక్సిజన్ బెడ్లలో 4,204 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కెమికల్ ఇంజినీర్ పేరుతో ప్రజలను భయపెడుతున్నారని ఆక్షేపించారు. అసత్య ప్రచారంపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
80 లక్షల డోసుల వ్యాక్సినేషన్
ఇప్పటివరకు 80 లక్షల డోసుల వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు తెలిపారు. రోజూ 2 లక్షల మందికి టీకా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 13లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్లు వేశామని అన్నారు. జ్వర సర్వే ద్వారా 4 లక్షలకు పైగా కిట్లు అందించామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే మూడు రౌండ్లు పూర్తయిందన్నారు.
చర్యలు చేపట్టాం
ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఆస్పత్రుల్లో అధిక బిల్లులు వసూలుపై చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అధిక ఫీజులు రీ ఫండ్ చేస్తున్నామని వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలేరియాను ఎలిమినేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
భయం వద్దు
కొవిడ్ సోకిందని భయంతోనే చనిపోయిన వాళ్లు ఎక్కువగా ఉన్నారని వైద్య విద్యా డైరెక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణ కోసం సర్కార్ తీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. ఎక్కువ నష్టం జరగలేదన్నారు.
ఇదీ చదవండి:Cases: రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా కేసులు, 12 మరణాలు