పోలీస్ వ్యవస్థపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు స్వీకరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకుగాను పోలీస్ స్టేషన్ల వారీగా అన్ని వర్గాలతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పటాన్చెరులో కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డుల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్వీయ క్రమశిక్షణతో...
పోలీస్ శాఖ పనితీరును సమాజం మొత్తం నిశితంగా పరిశీలిస్తోందని డీజీపీ తెలిపారు. పోలీస్ శాఖలోని ఉన్నత స్థాయి అధికారి నుంచి హోం గార్డ్ వరకు వరకు స్వీయ క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. ఒకే సారి 1000 కార్యాలయాలతో అనుసంధానమై దాదాపు మూడు గంటలపాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పటాన్చెరు ఘటన...
రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నోవిప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా పోలీసింగ్‌లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పటాన్చెరులో జరిగిన దురదృష్టకర ఘటన వల్ల మొత్తం పోలీస్ శాఖను అప్రతిష్ఠ పాల్జేసిందన్నారు.
సమాజం హర్షించే విధంగా
ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నైతిక విలువలు, మానవీయత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. చట్ట ప్రకారం, సమాజం హర్షించే విధంగా పనిచేస్తూ తమ విధి నిర్వహణలో లక్ష్యాలను సాధించాలని డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మానవ హక్కుల కమిషన్‌లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు