Dsp Transfers in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 53 మంది డీఎస్పీలను బదిలీచేస్తూ సోమవారం అర్ధరాత్రి తర్వాత.. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు. 30 పోలీసు సబ్ డివిజన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో వేరేవారిని నియమించారు. డీఎస్పీలుగా పోస్టింగులు పొందిన వారిలో 11 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అంటే ప్రాధాన్య పోస్టింగుల్లో 37శాతం వారికే దక్కాయి. ప్రస్తుతం డీఎస్పీలుగా పనిచేస్తున్న వారిలో 9మందికి ఈసారీ కీలక పోస్టింగులు దక్కాయి. వారిలోనూ నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు.
ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత :ప్రస్తుతం నరసాపురం డీఎస్పీగా పనిచేస్తున్న వీరాంజనేయరెడ్డి నెల్లూరు రూరల్‌కు, చిత్తూరు డీఎస్పీ ఎన్.సుధాకర్‌రెడ్డి పలమనేరుకు, గూడురులో పనిచేస్తున్న ఎం.రాజగోపాల్‌రెడ్డి నాయుడుపేటకు బదిలీ అయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి టెక్కలి డీఎస్పీగా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి కాకినాడ డీఎస్పీగా పోస్టింగ్ పొందారు.
నెల్లూరు ఎస్బీలో చేస్తున్న కోటారెడ్డి ఆత్మకూరు డీఎస్పీగా.. నంద్యాల ఎస్బీలో పనిచేస్తున్న మహేశ్వర్‌రెడ్డి నంద్యాల డీఎస్పీగా, రాజమహేంద్రవరం ఎస్బీలో చేస్తున్న శ్రీనివాసరెడ్డి నెల్లూరు పట్టణ డీఎస్పీగా బదిలీ అయ్యారు. కర్నూలు విజిలెన్స్ డీఎస్పీ ఐ.సుధాకర్‌రెడ్డి ఆళ్లగడ్డ డీఎస్పీగా, వీఆర్‌లో ఉన్న ఎం.సూర్యనారాయణ రెడ్డి గూడూరు డీఎస్పీగా, అనంతపురం ట్రాఫిక్ డీఎస్పీ జి.ప్రసాద్‌రెడ్డి అనంతపురం డీఎస్పీగా పోస్టింగ్ పొందారు.
ఎన్నికల్లో అనుకూలంగా ఉండేందుకే ఈ బదిలీలు :గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి, మిగతావారిని విస్మరించటం ఏంటని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు పోస్టింగులకు ప్రతిభ, సమర్థత, నిజాయతీ, పనితీరు వంటివి ప్రాతిపదిక కావాలే తప్ప, అధికారుల సామాజిక వర్గాలు చూసుకుని పోస్టింగులు ఇవ్వడం ఏంటని ఓ విశ్రాంత పోలీసు అధికారి.. 'ఈనాడు'తో వాపోయారు.
దీనివెనుక ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేయించుకునే ఎత్తుగడ ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారమైతే 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాలి. డీఎస్పీ స్థాయి అధికారులను.. సాధారణంగా రెండేళ్లకోసారి బదిలీ చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా బదిలీ అయిన అధికారులు ఎన్నికలవరకూ ఆయా స్థానాల్లోనే కొనసాగే అవకాశాలుంటాయి. అందుకే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీలుగా కీలకమైన చోట్ల తమకు అనుకూలమైన వర్గం వారిని నియమించుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.