రోజురోజుకూ కొత్త తరహాలో వెలుగులోకి వస్తోన్న సైబర్ నేరాలపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. సంప్రదాయ నేరాలతో పోలిస్తే.. సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయన్నారు. ముందస్తుగా గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం ద్వారానే వీటిని అరికట్టొచ్చని వివరించారు. సైబర్ నేరాల నిరోధానికి ఉద్దేశించిన సైబర్ వారియర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబర్ వారియర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సేఫ్టీ సంవత్సరం..
ఈ సంవత్సరాన్ని సైబర్ సేప్టీ సంవత్సరంగా ప్రకటించి.. అందుకు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన అధికారులకు వారంపాటు నిపుణులతో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, పట్టణ ప్రాంతాల్లోని ఠాణాల్లో ముగ్గురు, కమిషనరేట్ పరిధిలోని పీఎస్‌లలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1988 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు.