రాష్ట్రంలో మహిళా పోలీసు అధికారులకు గౌరవంతోపాటు అన్ని స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని స్టేషన్లలో మరికొన్ని సదుపాయాలను కల్పించాల్సి ఉందని అన్నారు.
మా ప్రతీపదం, ప్రగతి రథం అనే అంశంపై డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని మహిళా పోలీస్ అధికారులతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుంచి అదనపు డీజీలు జితేందర్, శివధర్ రెడ్డి, స్వాతి లక్రా, ఐజీలు నాగిరెడ్డి, బాల నాగాదేవీ, డీఐజీ సుమతి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ మా ప్రతీ పదం, ప్రగతి రథం అనే వీడియోను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో అన్ని పోలీసు నియామకాల్లో మహిళలకు ముప్పైమూడున్నర శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావంకు ముందు మహిళా పోలీస్ అధికారుల సంఖ్య 2,325 ఉండేదని... ఇప్పుడు మహిళా పోలీస్ అధికారుల సంఖ్య 4,819కు చేరిందని తెలిపారు.
సమర్థత ప్రాతిపదికగా మహిళా పోలీసు అధికారులకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా భద్రతా విభాగం రూపొందించిన... ఆమె పోలీస్ అయితే అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు.
ఇదీ చూడండి :పీసీసీ కొత్త బాస్ కోసం మూడో రోజూ అభిప్రాయసేకరణ