కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలను నిర్వహించాలని.. ఈ కార్యక్రమాల్లో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
‘పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం’ - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు
అక్టోబరు 21 నుంచి అక్టోబర్ 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ డే నిర్వహించనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాల ఏర్పాటుపై డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర వహిస్తూ విధి నిర్వహణలో అమరులైన, వైకల్యం పొందిన పోలీసులు, వారి కుటుంబాలకు తగు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ ఫ్లాగ్ డే ఫండ్ ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు. విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు, వికలాంగులకు, పెన్షనర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధంగా ఆర్థిక, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ మరింత ఆర్థిక సహకారం, భద్రత, పునరావాస కార్యక్రమాలు కల్పించే ఉద్దేశ్యంతో పోలీస్ ఫ్లాగ్-డే ఫండ్ ఏర్పాటు చేశారని అన్నారు.
ఇందుకు సంబందించిన విధి విధానాలు త్వరలోనే ప్రకటించనున్నారని డీజీపీ వివరించారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీలు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, అభిలాష బీస్త్, ఐజీలు నవీన్ చంద్, నాగిరెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు హాజరయ్యారు.