మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ మాదిరిగా రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో పోలీసుల కర్తవ్యాలను, వారి ఇబ్బందులను వివరిస్తూ కీరవాణి స్వరపరిచిన పాటను డీజీపీ మహేందర్ రెడ్డి.. ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీ రామ్ పాటను రచించారు.
తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీసు సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని కీరవాణి గుర్తు చేసుకున్నారు. 'ఇస్తున్నా ప్రాణం మీ కోసం' అనే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీల కోరిక మేరకు స్వర పరిచి పాడానని తెలిపారు.