రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన సేవలందించే వాతావరణం కల్పించేందుకు 5-ఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టెయిన్ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 9 కమిషనరేట్లు, 20 జిల్లాల ఆర్‌ఐలతో బుధవారం తన కార్యాలయంలో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
అర్హత మేరకు కిట్లు
అన్ని ఠాణాల్లో 15 ఏళ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనలను అనుసరించి వేలం వేయగా రూ.50.35 లక్షలు ప్రభుత్వ ఖజానాలో సమకూరాయని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్, గ్రౌండ్‌షీట్, బ్లాంకెట్, స్వెటర్ తదితర వస్తువులతో కూడిన కిట్‌ను సకాలంలో సమకూర్చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా పోలీసు సిబ్బందికి వారి అర్హత మేరకు అందించే కిట్ల పంపిణీని డి.జి.పి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్ విభాగం ఐజీ సంజయ్‌జైన్, డీఎస్పీ వేణుగోపాల్‌ను అభినందించారు. పోలీసు కార్యాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆర్‌ఐలకు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు.