తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు పార్టీ సంక్షోభంలో ఉంది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు: డీజీపీ - DGP MAHENDAR REDDY COMMENTS ON MAOIST PARTY

మావోయిస్టు అగ్ర నాయకత్వం అస్తిత్వం కోల్పోయిందని, అగ్రనేతలందరూ అనారోగ్యం బారినపడ్డారని పోలీస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. అగ్రనేతల మధ్య భేదాభిప్రాయాలున్నాయని.. సిద్ధాంతాల విషయంలో వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోందని ఇంటిలిజెన్స్ విభాగం పోలీసులకు సమాచారం అందింది. మావోయిస్టు పార్టీని ఎవరూ దెబ్బ తీయాల్సిన అవసరం లేదని.. అదే కుప్పకూలిపోతుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న లొంగుబాట్లు, అరెస్టులు మహేందర్ రెడ్డి వ్యాఖ్యలకు దోహదం చేస్తున్నాయి.

మావోయిస్టు పార్టీ సంక్షోభంలో ఉంది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు: డీజీపీ
మావోయిస్టు పార్టీ సంక్షోభంలో ఉంది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు: డీజీపీ

By

Published : Oct 9, 2022, 8:08 AM IST

మావోయిస్టు పార్టీ సంక్షోభంలో ఉంది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు: డీజీపీ

మావోయిస్టు పార్టీకీ కంచుకోటగా ఉన్న తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆ ఉనికి లేకుండా పోయింది. రాష్ట్రానికి ఛత్తీస్​గఢ్​, ఆంధ్ర సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ పోలీసులు నిత్యం కూంబింగ్ చేస్తూ మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు, నల్లమల అడవుల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో.. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. 9 ఏళ్లుగా మావోయిస్టులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ వస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లై ఉండి ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు నాయకులను లొంగిపోయేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మావోయిస్టుల చిన్నాచితకా కార్యక్రమాలు తప్పితే, మిగతా జిల్లాల్లో ఆ ప్రభావమే కనిపించడం లేదు. గతేడాది మావోయిస్టు నాయకుడు రంజిత్, నెల క్రితం అతని తల్లి సావిత్రి.. తాజాగా తెనాలికి చెందిన ఉషారాణి అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయారు.

లొంగుబాట్లు ఒకవైపు, అరెస్టులు మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీని ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ఆరుగురు అరెస్టయ్యారు. వీళ్లలో ఉత్తర, ఈశాన్య భారతాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులుండటం గమనార్హం. కేంద్ర కమిటీలో మొత్తం 25 మంది సభ్యులుండగా.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 14 మంది ఉన్నారు. వీరిలో 11 మంది తెలంగాణ వాళ్లు కాగా.. మిగతా ముగ్గురు ఏపీకి చెందిన వాళ్లున్నారు. 2017 నుంచి లొంగుబాట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న 2017లో, సుధాకర్ 2019లో సతీ సమేతంగా పోలీసులకు లొంగిపోయారు. రామన్న, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతమున్న కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది వయోభారంతో బాధపడుతున్నట్లు పోలీసుల నిఘాలో బయటపడింది. మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందని.. అగ్రనేతలు మొదలుకొని ఎవరు లొంగిపోయినా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details