Medak third degree incident DGP serious: మెదక్ జిల్లాలో దొంగ అనే అనుమానంతో ఖదీర్‌ఖాన్ అనే వ్యక్తిపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీస్ అధికారిని ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారిగా నియమించాలని.. ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈఘటనలో బాధ్యులుగా భావిస్తున్న మెదక్ పీఎస్ సీఐ, ఎస్సైలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు.
పోలీసులు కొట్టడం వల్లే ఖదీర్ ఖాన్ మృతి చెందాడ..!:గత నెల 27వ తేదీన మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఖదీర్ ఖాన్‌ను అదే నెల 29వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీ వరకు పీఎస్‌లోనే ఉంచి.. ఆ తర్వాత భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురికావడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి బంధువులు సహాయంతో తరలించారు.
DGP serious about Qadir Khan death: అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఖదీర్ చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీన రాత్రి మృతి చెందాడు. అనంతరం నిన్న మృతదేహానికి శవపంచనామ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్దేశ్వరి ఆరోపించారు. అనంతరం ఆమె పోలీసు ఉన్నతాధికారులకు తన భర్త మృతి చెందడానికి పోలీసులే కారణమంటూ ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్: ఖదీర్‌ఖాన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొయినోద్దీన్ నేతృత్వంలోని బృందం మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దొంగతన కేసులో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి ఖదీర్‌ఖాన్ మృతికి కారకులైన ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ ప్రశాంత్, పవన్‌కుమార్‌ను వెంటనే సర్వీసు నుంచి తొలగించాలని కోరారు. మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
పోలీసులు తనను ఏవిధంగా హింసించారో మృతుడు ఖదీర్‌ఖాన్ చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. చోరీ చేయలేదని చెప్పినా.. వినిపించుకోకుండా చితకబాదారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.