DGP AnjaniKumar on Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలోనూ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్, ఇతర అధికారులతో కలిసి డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 2900 మందిని రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అంజనీకుమర్ తెలిపారు.
DGP on Rains in Telangana :మోచన్‌పల్లిలో వరదలో చిక్కుకున్న వారిని 6 ఎన్డీఆర్ఎప్ బృందాల సహాయంతో రక్షించినట్లు అంజనీకుమార్ తెలిపారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకి రావాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలోని.. మూడు కమిషనరేట్‌లలో పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ముసారాంబాగ్ వంతెనపై కూడా వరద నీరు అదుపులోనే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కొంతమంది వరద ప్రవాహం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయవద్దని అన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అంజనీకుమార్ వెల్లడించారు.
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ తరఫున వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు.. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ప్రజలకు వరదల వల్ల ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా డయల్ 100, 101కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి నీళ్ల వద్దకు.. ఎవ్వరూ వెళ్లవద్దని అన్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని డీజీ నాగిరెడ్డి వివరించారు.