Accommodation Charges Hike in TTD: కలియుగ వైకుంఠనాథుడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే పేద, మధ్య తరగతి భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను తితిదే భారీగా పెంచేసింది. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి కేంద్రాలను ఇటీవల 110 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన తితిదే.. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించడం వల్ల అద్దె పెంచినట్లు చెబుతోంది. తిరుమలలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచ జన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా పెంచిన తితిదే తాజాగా నారాయణగిరి వసతి గృహాలు, ఎస్వీ అతిథి గృహం, స్పెషల్ టైప్ క్వార్టర్స్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు ఇబ్బందికరంగా మారింది.
గతంలో నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళామాత వసతి గృహాల అద్దె 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచేశారు. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటి నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్ లోని 1, 2, 3 గదుల అద్దెను 150 నుంచి జీఎస్టీతో కలిపి 17వందలు వసూలు చేస్తున్నారు. నారాయణగిరి రెస్ట్ హౌస్-4లో ఒక్కో గదికి 750 రూపాయల నుంచి 17 వందలకు పెంచారు. కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2 వేల 200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజ్‌ల్లో అద్దెను 750 నుంచి 2వేల 800 రూపాయలకు పెంచారు. వసతి గదుల అద్దెను భారీగా పెంచడంపై సామాన్య భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ భక్తులు బస చేసే 50, 100 రూపాయల అద్దెకు లభించే వసతి గృహాల్లోనూ ఆధునీకీకరణ పనులు పూర్తిచేసి అద్దె పెంచుతారన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి వసతి గృహాల అద్దె తగ్గించాలని భక్తులు కోరుతున్నారు.