తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త గురుమూర్తి సహకారంతో 100 కోట్ల అక్రమాస్తులు - ఐఎంఎస్  కుంభకోణం తాజా సమాచారం

ఐఎంఎస్  కుంభకోణం  ప్రధాన  సూత్రధారి దేవికా రాణి  100  కోట్ల ఆస్తులు  కూడబెట్టారు. పక్క సమాచారంతో  అవినీతి నిరోధక శాఖ అధికారులు  ఆస్తుల  చిట్టాను  బయటపెట్టారు. దేవికారాణి.. తన భర్త గురుమూర్తి సహకారంతో  పలుచోట్ల స్థిరచరాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

భర్త గురుమూర్తి సహకారంతో 100 కోట్ల అక్రమాస్తులు
భర్త గురుమూర్తి సహకారంతో 100 కోట్ల అక్రమాస్తులు

By

Published : Dec 6, 2019, 5:36 AM IST

Updated : Dec 6, 2019, 5:47 AM IST

బీమా వైద్య సేవల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన దేవికా రాణి భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆమె భర్త, సివిల్ సర్జన్​గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి సహకారంతో స్థిరచరాస్తులు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు తేల్చారు. దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి లంచాలు తీసుకున్న గురుమూర్తి.. స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవికా రాణి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. పక్కా సమాచారంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్, కడప, తిరుపతిలో దేవికా రాణి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించి.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కోట్లకు పైగా ఆస్తులు..

బహుళ అంతస్థుల భవనాల్లో ఫ్లాట్లు, 32 ఎకరాల పొలం, తెలుగు రాష్ట్రాల్లో 11 ఇంటి స్థలాలు, వైజాగ్​లో సొంత ఇల్లు, హైదరాబాద్​లో 16 వాణిజ్య దుకాణాలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. 23 బ్యాంకు ఖాతాల్లో కోటి 13లక్షల నగదు, నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో 34 లక్షల డిపాజిట్, నిర్మాణ రంగంలో 6. 63 కోట్ల పెట్టుబడులు, ఇంట్లో 8 లక్షల నగదు గుర్తించారు. షేక్ పేటలో దేవికా రాణి నివాసం ఉంటున్న విల్లా విలువ 3.8 కోట్లు. షేక్ పేటలోనే ఆదిత్య టవర్స్​లో ఉన్న మూడు ఫ్లాట్ల విలువ 2.65 కోట్లు. దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ 38 లక్షలు, 26 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 7లక్షల ఎలక్ట్రానిక్​ పరికరాలు, 20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. సోమాజీగూడలో ఫ్లాటు, రాజేంద్రనగర్ లో సొంత ఇల్లు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవికా రాణి భర్త గురుమూర్తిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

19కు నిందితుల సంఖ్య:

దేవికా రాణి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు సుమారు 8 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు డాక్యుమెంట్ల విలువ ప్రకారం 15 కోట్లుగా ఉందని అనిశా అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్​లో ప్రస్తుత విలువ ప్రకారం స్థిరాస్తుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా ఉన్న దేవికారాణి చంచల్ గూడ మహిళా జైల్లో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు. ఆమెతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయడం వల్ల సంఖ్య 19కి చేరింది. దేవికారాణిని, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అనిశా అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: డొల్ల కంపెనీలతో రూ.3 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు

Last Updated : Dec 6, 2019, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details