తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి - Government focus on ghmc

హైదరాబాద్‌లో వ్యర్థాలు, నాలాల సమర్థ నిర్వహణతో పాటు చెరువుల పరిరక్షణ, అభివృద్ధి చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వచ్చే మూడు నాలుగు మాసాలకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్న సర్కార్... వ్యర్థాల నిర్వహణకి జవహర్‌నగర్‌ సహా పారానగర్, లక్డారం ప్రాంతాల్ని వినియోగించనుంది. హుస్సేన్​సాగర్ చుట్టూ ఇంకా ఇతర ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే రహదార్ల వెంట సైక్లింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేయనున్నారు. జనవరి నాటికి మరికొన్ని ఫుట్​ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి
గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

By

Published : Nov 7, 2020, 5:28 AM IST

గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

భారీవర్షాలు, వరదల కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. 3 దశల్లో వివిధ కార్యక్రమాలు అమలు చేయనుంది. నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, విస్తరణతో పాటు చెరువులపై దృష్టి సారించనున్నారు. ఇటీవలి వర్షాలకు 268 కాలనీలు వరద ప్రభావానికి గురయ్యాయని గుర్తించారు.

ప్రత్యేక దృష్టి...

ఎస్​ఎన్​డీపీ ద్వారా నాలాలు, డ్రైన్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం... సమగ్ర సర్వే చేపట్టి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనుంది. నాలాలు, డ్రైన్ల ద్వారా నీరు సాఫీగా వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను గుర్తించి తొలగించనున్నారు. సమగ్ర సర్వే పూర్తయ్యాక అంచనాలకు సంబంధించి పూర్తిస్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. తదుపరి దశలో చెరువులపై దృష్టి సారిస్తారు.

సంయుక్తంగా...

పురపాలక, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా చెరువుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధి చేపట్టనున్నాయి. వర్షాలు ప్రారంభం కాగానే చెరువుల్లో నుంచి కొంత నీటిని దిగువకు వదలాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కొంత మేర ఖాళీ ఉండడం ద్వారా ఎగువ నుంచి ఎక్కువ నీరు వచ్చిచేరినా ఇబ్బందులు రావదన్నది ఆలోచన.

10వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు...

వర్షాలు, వరదలతో వ్యర్థాల పరిమాణం బాగా పెరిగింది. సాధారణంగా హైదరాబాద్‌లో రోజుకు 6వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తుండగా వర్షాలు, వరదల అనంతరం గత పక్షం రోజులుగా ప్రతిరోజూ 10వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణకు కేవలం జవహర్​నగర్ కాకుండా అదనంగా మరో రెండు ప్రాంతాలను ఉపయోగించేందుకు రంగం సిద్ధమవుతోంది.

17 ట్రాన్స్​ఫర్ స్టేషన్స్...

పారానగర్, లక్డారం ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉందని అంటున్నారు. వ్యర్థాల సేకరణకు 17ట్రాన్స్​ఫర్ స్టేషన్స్ ఉండగా వీటికి అదనంగా రెండు డివిజన్లకు ఒకటి చొప్పున ప్రత్యేక ట్రాన్స్​ఫర్​స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలను ట్రాన్స్​ఫర్ స్టేషన్స్​కు పంపకుండా ప్రత్యామ్నాయంగా ఇవిఉపయోగపడతాయని ఎలాంటి దుర్వాసనా ఉండబోదంటున్నారు.

మరో రెండు వారాలు...

పారిశుద్ధ్య నిర్వహణ కోసం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మరో రెండు వారాల పాటు కొనసాగనుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నం 45 నుంచి పాత ముంబయి హైవే వరకు సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా వేసే అన్ని రహదార్ల వెంట సైక్లింగ్ ట్రాక్​లు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ భావిస్తోంది.

40 ఫుట్​ఓవర్​ బ్రిడ్జిలు...

నగరంలో పాదచారుల కోసం కొత్తగా 40 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని... చేపట్టింది. లిప్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వివిధ రకాల డిజైన్లను సిద్ధం చేశారు. జనవరి వరకు 22 ఫుట్​ఓవర్ బ్రిడ్జ్​లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.

ఇదీ చదవండి:ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌

ABOUT THE AUTHOR

...view details