వానాకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వర్షా కాలంలో పాటించాల్సిన జాగ్రత్తలపై బుధవారం నామాలగుండులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాలాల ద్వారా వరద నీటి సరఫరా సాఫీగా సాగేల ఏర్పాట్లు చేయాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు. మాన్సూన్ టీంల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. అనంతరం ఐదు మున్సిపల్ డివిజన్లకు మాన్సూన్ అత్యవసర వాహనాలను పంపిణీ చేశారు.
సితాఫల్మండి డివిజన్లో పాదయాత్ర...
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో సివరేజీ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. సితాఫల్మండి డివిజన్లోని చిలకలగూడలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సివరేజీ పైప్లైన్ల నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. అనంతరం చిలకలగూడలోని కింది బస్తీ, చర్చగల్లి, పాత కల్లు కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. సమీక్షలో కార్పొరేటర్లు సామల హేమ, ఆలకుంట సరస్వతి, ధనజన బాయి గౌడ్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ పల్లె మోహన్ రెడ్డి, ఈఈ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఈఈ పరమేష్, స్థానిక వైద్యాధికారితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.